తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఇప్పసారా చిచ్చు రేపింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు పానీయాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాలని చేసిన ప్రతిపాదన, చివరకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గౌరవానికి భంగం కలిగించే స్థాయికి చేరడం సభలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పసారాను శాస్త్రీయంగా అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందని, గిరిజన సంప్రదాయాలకు గుర్తింపు లభిస్తుందని అనిరుధ్ రెడ్డి గట్టిగా వాదించారు.
ఈ చర్చలోకి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రవేశించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెడుతోందని ఎద్దేవా చేస్తూ.. పొరపాటున ఈ ఇప్పసారాకు మాత్రం ఇందిరమ్మ పేరు తగిలించవద్దని ఆయన వేసిన సెటైర్లు కాంగ్రెస్ బెంచీల్లో అగ్గి రాజేసాయి. కావాలంటే దీనికి ఇప్ప టకీలా అని పేరు పెట్టుకోండంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మంత్రులను, ఎమ్మెల్యేలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకురాలిని సారా అంశంతో ముడిపెట్టడం అగౌరవమని మంత్రులు మండిపడ్డారు. రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టగా, తాను కేవలం సలహా మాత్రమే ఇచ్చానని, ఇందులో తప్పేముందని ఆయన ఎదురుదాడికి దిగారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం ముదరడంతో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని, ఆ అనుచిత వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
అసలు ఈ ఇప్పసారాను అనిరుథ్ రెడ్డి ఎందుకు ఎత్తుకున్నారో దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఎందుకు అనుమతించారో కానీ చివరికి అతి రివర్స్ అయింది.


