తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన చేశారు. కేంద్రం పెట్టిన నిబంధనల వల్ల వచ్చే ఏడాది మార్చి తర్వాత పునర్విభజన కమిషన్ వేస్తామని చెప్పారు. కానీ అప్పటికి పెరిగే రాజకీయ వేడి కారణంగా కమిషన్ వేసినా అది రాజకీయ వివాదాలకే దారి తీస్తుంది. జిల్లాల విభజన, పునర్విభజన వరకూ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
కేంద్రం ఆంక్షలు – జనగణన అడ్డంకి
జిల్లాల విభజన ఇప్పుడల్లా జరగకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు. దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన దృష్ట్యా, రాష్ట్రాలు తమ పరిపాలనా సరిహద్దులను మార్చకూడదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా జనగణన ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్రాల సరిహద్దులను ఫ్రీజ్ చేస్తారు. 2027 మార్చి లేదా ఆ తర్వాత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉన్నందున, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ విషయంలో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అంత ఈజీగా తేలేది కాదు!
జిల్లాల విభజనపై అధ్యయనం చేయడానికి ఒక జ్యుడీషియల్ కమిషన్ వేస్తామని సీఎం ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఒకసారి ఈ ప్రక్రియ మొదలైతే కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
ఎన్నికల మూడ్ – రిస్క్ తీసుకుంటారా?
2027 చివరి నాటికి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణ వచ్చేస్తుంది. జిల్లాల పునర్విభజన అనేది అత్యంత సున్నితమైన అంశం. ఒక ప్రాంతాన్ని జిల్లాగా చేస్తే మరో ప్రాంతం నుండి వ్యతిరేకత రావడం సహజం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం, కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల వచ్చే అదనపు పరిపాలనా వ్యయం భరించడం కూడా కష్టమే. అందుకే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనం కంటే రాజకీయ భద్రత కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఈ అంశాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది.
