టాలీవుడ్ కి ఎప్పుడూ హీరోయిన్ల కొరతే. ఇక్కడ కావాల్సినంత మంది హీరోలు, దర్శకులు ఉన్నారు. హీరోయిన్ల కోసం మాత్రం ప్రతీసారీ అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. అయితే తొలిసారి.. టాలీవుడ్ కి హీరోల కొరత వచ్చేసింది. ప్రతీ హీరో రకరకాల ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. దాంతో కొంతమంది దర్శకులకు హీరోలు దొరకడం లేదు. కథలు రాసేసుకొని, నిర్మాతల్ని ఓకే చేసేసుకొని మరీ.. హీరోల కోసం వెయిటింగ్ లో పడిపోయారు. టైర్ 1, 2, 3 హీరోలు ఇంత మంది ఉండగా, కొత్త హీరోలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటూ కూడా హీరోల విషయంలో ఇంత కొరత రావడం ఆశ్చర్యకరమే.
‘అఖండ 2’ తరవాత బోయపాటి శ్రీను హీరోల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. కానీ.. ఏ హీరో సెట్ కావడం లేదు. ఆయనకు మీడియం రేంజ్ హీరోలు సరిపోరు. స్టార్ హీరోలే కావాలి. కానీ వాళ్లంతా బిజీ బిజీ. దాంతో బోయపాటి బాలీవుడ్ వరకూ వెళ్లాల్సివస్తోంది. రణబీర్ సింగ్ తో బోయపాటి ఓ సినిమా చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది కానీ, ఆ ప్రాజెక్ట్ సైతం సెట్టయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఈమధ్య ‘ఉస్తాద్’ తో ప్రేక్షకుల్ని పలకరించారు హరీష్ శంకర్. ఈ సినిమా హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇద్దరు నిర్మాతలు ఆయనకు అడ్వాన్సులు ఇచ్చారు. కథ కూడా రెడీనే. కానీ హీరో కావాలి. బాలయ్య కోసం ఆయన ఓ కథ తయారు చేసుకొన్నారు. కానీ ఇప్పటికిప్పుడు బాలయ్యతో సినిమా అంటే అవ్వదు. సో… ఈలోగా మరో హీరోని చూసుకోవాల్సిందే.
‘రాజాసాబ్’ మారుతికి పెద్ద షాకే ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మారుతితో సినిమా అంటే హీరోలు కాస్త ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. రామ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలకు మారుతి కథలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కానీ.. కుదరడం లేదు. ఈలోగా కథ కూడా లాక్ చేసేశారు మారుతి. నిర్మాణ సంస్థ కూడా రెడీగా ఉంది. పరశురామ్ ది కూడా ఇదే పరిస్థితి. `ఫ్యామిలీ స్టార్` తరవాత ఆయన సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయాలి. కథ కూడా ఓకే అయిపోయింది. కానీ హీరో దొరకడం లేదు. తమిళ నాట నుంచి కూడా హీరోల్ని దిగుమతి చేసుకొందాంమని చూస్తున్నారు. కానీ అవ్వడం లేదు. కొరటాల శివ పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ‘దేవర 2 ఉంది’ అంటున్నారు కానీ, అదెప్పుడో అర్థం కావడం లేదు ఈగ్యాప్ లో మరో హీరోతో సినిమా చేయాలా, లేదంటే ఎన్టీఆర్ కోసం ఎదురుచూడాలా అనే విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతున్నారు. ఆయనకు కూడా హీరోలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అదే జరిగితే ఈ పాటికే ఆయన సినిమా మొదలై ఉండేది. సుధీర్ వర్మ, అసిత్ గోళీ, తిరుమల కిషోర్ లాంటి దర్శకులు కథలు పట్టుకొని తిరుగుతున్నారు. అయితే హీరోల కాల్షీట్లు అందుబాటులో లేవు. ఇలా ఎంతోమంది. ఒక హిట్టు ఇచ్చి కూడా ఖాళీగా ఉన్న దర్శకులు ఉన్నారు. వాళ్లందరికీ హీరోలు దొరికితే.. మరిన్ని కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. మరి వీళ్లకు హీరోలు ఛాన్సులు ఇచ్చేది ఎప్పుడో?
