ఆంధ్రాలో తృతీయ కూట‌మిపై చర్చ ఇదేనా..!

ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ దృష్టంతా కేంద్రంపైనే ఉంది. విభ‌జ‌న చట్టం, ఇచ్చిన హామీల‌పై కేంద్రం స్పంద‌న ఎలా ఉంటుందా అనేదే ఇక్క‌డ ప్రాధాన్య‌త సంత‌రించుకున్న అంశం. మొద‌టి రోజు పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఏపీ ఎంపీలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. అయితే, ఏపీ పోరాటానికి అనూహ్యంగా తెరాస ఎంపీలు కూడా ఢిల్లీలో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రాకి ఎందుకివ్వ‌రూ అంటూ కేసీఆర్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆంధ్రా గొంతును తామూ వినిపించాల‌నే ఆత్రం తెరాస‌లో క‌నిపిస్తోంది. దీంతో కేసీఆర్ తెర‌మీదికి తీసుకొచ్చిన మూడో ఫ్రెంట్ ఆలోచనపై ఆంధ్రాలో కూడా చ‌ర్చకు తెర లేచింది.

నిజానికి, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం ఈ ఫ్రెంట్ విష‌య‌మై స్పందించే అవ‌కాశం కాస్త త‌క్కువ‌గానే ఉంది. ఎందుకంటే, ఆయ‌న ఫోక‌స్ అంతా ఇప్పుడు ఢిల్లీ మీదా, భాజ‌పా మీదే ఉంది. అయితే, ఆంధ్రా నుంచి మూడో కూట‌మికి మ‌ద్ద‌తు అంటే… ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచే వ‌చ్చింద‌ని చెప్పాలి. కేసీఆర్ ఆలోచ‌న‌కు ఆయ‌నే ముందుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. టీడీపీ నుంచి అలాంటి ప్ర‌క‌ట‌న ఇప్పట్లో ఊహించ‌లేం. ఎందుకంటే, తెరాస – టీడీపీ ల మ‌ధ్య ఆ స్థాయి సఖ్య‌త ఆచ‌ర‌ణ సాధ్యం కాని ఆలోచ‌న‌గా ప్ర‌స్తుతానికి ఉంది. తెరాస‌, టీడీపీల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణం ఉన్న‌మాట వాస్త‌వ‌మే. అలాగ‌ని, ప్ర‌త్యేక హోదాకు కేసీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినంత మాత్రాన మూడో ఫ్రెంట్ కి టీడీపీ సానుకూలంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. అలాగని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాల్సిన ప్రత్యేక అవసరమూ టీడీపీకి లేదు. నిజానికి, ఆ చ‌ర్చ టీడీపీలో మొద‌ల‌య్యేందుకు ఇంకాస్త స‌మ‌యం ఉంది.

ఇక‌, వైకాపా విష‌యానికి వ‌స్తే.. వారు సొంతంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి లేరని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప, జగన్ ఎటూ తేల్చుకోలేరు..! భాజ‌పాతో టీడీపీ తెగతెంపులు చేసుకుని, మూడో ఫ్రెంట్ వైపు చంద్ర‌బాబు కూడా అడుగులేస్తే.. ఆ స‌మ‌యంలో భాజ‌పా పంచ‌న వైకాపా చేరే ఆలోచ‌నే చేస్తుంది. ఒక‌వేళ‌, ప్ర‌స్తుతం భాజ‌పాతో టీడీపీ చేస్తున్న పోరాటం ఫ‌లించి, కేంద్రం నుంచి కొన్ని కేటాయింపులు వ‌స్తే, పొత్తు కొన‌సాగే అవ‌కాశం ఉంటుంది. అదే జ‌రిగితే, అప్పుడు కేసీఆర్ కూట‌మివైపు వైకాపా చూసే అవ‌కాశం ఉంటుంది. అక్క‌డ కూడా ఓ స‌మ‌స్య ఉంటుంది. ఎలా అంటే, కేసీఆర్ కూట‌మికి ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాబ‌ట్టి, ప‌వ‌న్ చేరిన కూట‌మిలోనే జ‌గ‌న్ చేర‌తారా అనే చ‌ర్చ కూడా రావొచ్చు. మొత్తానికి, ప్ర‌స్తుతం కేసీఆర్ మొద‌లుపెట్టిన తృతీయ ఫ్రెంట్ ప్ర‌య‌త్నాల‌పై ఏపీలో సందిగ్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. ఇంకా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీ వేసే అడుగుల‌ను బ‌ట్టీ ఇత‌ర పార్టీల వ్యూహాలు మార్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటే త‌ప్ప, ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు దృష్టి సారించే అవ‌కాశాలు ప్ర‌స్తుతానికి లేవ‌నే అభిప్రాయ‌మే వ్య‌క్త‌మౌతోంది. టీడీపీకి భాజ‌పాతో నేరుగా పోరాటం అనివార్యం అనే పరిస్థితి వ‌స్తే అప్ప‌టి వ్యూహాలు, స‌మీక‌ర‌ణాలు మరోలా మార‌తాయి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.