కేసీఆర్ కి స్ఫూర్తి ఎవ‌రు.. స‌వాల్ ఏంటి..?

స‌రిగ్గా వారం రోజుల్లో సీఎం కేసీఆర్ రాజ‌కీయ వ్యూహ‌మంతా ఒక్క‌సారిగా మార్చేసుకున్నారు. మూడో ఫ్రెంట్ పెడ‌తాన‌నీ, దానికి తానే నాయ‌క‌త్వం వ‌హిస్తానంటూ కార్యాచ‌రణ సిద్ధం చేసుకున్నారు. ఇంత‌కీ, ఈ ఆలోచ‌న ఎక్క‌డ మొద‌లైందంటే… ఆ మ‌ధ్య‌ రాజ్ భ‌వ‌న్ లో విందు సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేసీఆర్ లు క‌లుసుకున్న ద‌గ్గ‌రే బీజం ప‌డిందంటున్నారు! ఆ త‌రువాత‌, కేసీఆర్ ఇంటికి ప‌వ‌న్ వెళ్లారు. అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్యా చాలాసేపు ఈ ఉత్త‌రాది ఆధిప‌త్యంపైనా, నిర్ల‌క్ష్యానికి గురౌతున్న ద‌క్షిణాదికి సంబంధించి కొంత చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అక్క‌డే కేసీఆర్ కు కొంత స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న వ‌చ్చింద‌నీ, కానీ దానిపై మ‌రింత స్ఫ‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కూ వేచి చూశార‌ని తెలుస్తోంది.

ఈ మ‌ధ్య కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ సీతారాం ఏచూరితోపాటు కొంత‌మంది పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యార‌ని స‌మాచారం. అంతేకాదు, ప్ర‌ముఖ పాత్రికేయుడు రాజ్దీప్ స‌ర్దేశాయ్ తో కూడా కేసీఆర్ చాలాసేపు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డే మూడో ఫ్రెంట్ కి నాయ‌క‌త్వం వ‌హించాల‌నే ఆలోచ‌న‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌నీ, అక్క‌డి నుంచి జాగ్ర‌త్త‌గా దీనికి కావాల్సిన నేప‌థ్యాన్ని త‌యారు చేసుకుంటూ వ‌చ్చార‌ని చెప్పొచ్చు. మూడో ఫ్రెంట్ ఏర్పాటు చేస్తాను, ఒక అజెండాను త‌యారు చేసి ప్ర‌జ‌లు ముందు పెడ‌తాను, కాంగ్రెస్ – భాజ‌పాలు చేయ‌లేని విధంగా దేశానికి ఏం చెయ్యొచ్చో అనేది ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తాను అనేది కేసీఆర్ ఆలోచ‌న‌గా ఉంద‌ని అంటున్నారు. దీన్లోభాగంగానే దేశ‌వ్యాప్తంగా కొన్ని ప‌ర్య‌టించి వ‌రుస‌గా కొన్ని మీటింగులు ఏర్పాటుచేసుకున్నారు. ఇదీ కేసీఆర్ ఆలోచ‌న‌.

ఇక‌, కేసీఆర్ ముందున్న స‌వాల్ ఏంటంటే… రెండు జాతీయ పార్టీల‌కు వ్య‌తిరేకంగా మూడో ఫ్రెంట్ అన‌డం. ఎందుకంటే, దేశంలో కొన్నిప్రాంతీయ పార్టీలు భాజ‌పాని మాత్ర‌మే శ‌త్రువుగా చూస్తున్నాయి. భాజపా నుంచి మాత్రమే ముప్పు పొంచి ఉంద‌ని భావిస్తున్నాయి. కాంగ్రెస్ మీద ఆ స్థాయి వ్య‌తిరేక‌తా, ఆగ్ర‌హం లాంటివి లేవనే చెప్పాలి. కేవ‌లం తెలంగాణలో మాత్ర‌మే కేసీఆర్ కి కాంగ్రెస్ కి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి. మ‌రోరాష్ట్రంలో మ‌రో ప్రాంతీయ పార్టీకి కాక‌పోవచ్చు. 1996లో చంద్ర‌బాబు నాయుడు యునైటెడ్ ఫ్రెంట్ క‌న్వీన‌ర్ అయ్యాక‌ ఈ త‌ర‌హా ఇబ్బందే వ‌చ్చింది. కాంగ్రెస్ మ‌ద్ద‌తుతోనే మ‌రోసారి ప్ర‌భుత్వం అధికారంలోకి రాబోతోంద‌న‌గా యునైటెడ్ ఫ్రెంట్ ను చంద్ర‌బాబు వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఎందుకంటే, ఆంధ్రాలో టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కాబ‌ట్టి! టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పై ఉన్న వ్య‌తిరేక‌త నుంచి. ఇలాంటి స‌మ‌స్యే రేప్పొద్దున కేసీఆర్ ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి, ఇక్క‌డ కేసీఆర్ ఇవ్వాల్సిన స్ప‌ష్ట‌త ఏంటంటే… ఆయ‌న ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ది జాతీయ పార్టీల వ్య‌తిరేక కూట‌మా..? లేదా, ప్రాంతీయ పార్టీల ఐక్య కూట‌మా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.