థియేటర్లకు ఆడియన్స్ ని రప్పించడం ఎలా? అనేదే బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ ని, మూడ్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయిన రోజులు ఇవి. ఏ సినిమాని ఆదరిస్తారో, దేన్ని లైట్ గా తీసుకొంటారో ఊహించలేని పరిస్థితి. స్టార్ హీరో సినిమాల్ని సైతం ఇగ్నోర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు తెలుగు వాళ్లని చాలా సమస్యలు చుట్టు ముట్టాయి. ఓవైపు గ్యాస్ కొరత, మరోవైపు పెట్రోల్ గోల.. తెల్లారి లేస్తే వీటి గురించే చర్చ. ఇలాంటి సమయంలో సినిమా.. థియేటర్.. వీటి గురించి ఆలోచించే తీరిక ఉందా అనేది అర్థం కావడం లేదు.
ఈ సమ్మర్ లో చాలా సినిమాలు రాబోతున్నాయి. అందులో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి. బైకర్, డెకాయిట్, స్వయంభూ ఇలాంటి సినిమాలు వరుస కట్టబోతున్నాయి. ‘పెద్ది’ ఉండనే ఉంది. ‘పెద్ది’లాంటి సినిమా వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ వేరు. కానీ చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి అలా ఉండదు. కరెంట్ ఎఫైర్స్ వాళ్లపై పెద్ద ప్రభావం చూపిస్తుంటాయి. ఈ సినిమాల గురించి జనం మాట్లాడుకొనేలా చేయడం పెద్ద టాస్క్.
సోషల్ మీడియా తెరిస్తే పెట్రోలు, గ్యాస్ తప్ప మరేం కనిపించడం లేదు. సినిమాల గురించి మాట్లాడుకోవడం లేదా?అంటే అది కూడా ఉంది. ‘దురంధర్ 2’ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. `దురంధర్` గురించి చర్చ చాలా హాట్ హాట్ గా సాగుతోంది. ఆదిత్యా ధార్ సృష్టించిన పాత్రల గురించి, నటీనటుల గురించి క్షణ్ణంగా చర్చించుకొంటున్నారు. ఈ వేడిలో వేరే సినిమాల టీజర్, ట్రైలర్, పోస్టర్, పాట.. ఇలా ఏది రిలీజ్ చేసినా ఆనడం లేదు. ఏదైనా ఓ సూపర్ హిట్ సినిమా వచ్చినప్పుడు దాని మానియా కొన్నాళ్ల పాటు అలానే ఉంటుంది. ఈమధ్యలో ఏ సినిమా చూసినా కంటికి ఆనదు. ‘దురంధర్ 2’ తరవాత కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ‘దురంధర్ 2’ తెలుగు రాష్ట్రాలపై కూడా ఎఫెక్ట్ చూపించింది. తెలుగు డబ్బింగ్ కి మంచి స్పందనే వచ్చింది. ఇంకా థియేటర్లలో ఆడుతోంది కూడా. ఇలాంటి పరిస్థితిలో రేపు విడుదలయ్యే ‘బ్యాండ్ మేళం’, రాబోయే ‘బైకర్’, ‘డెకాయిట్’ సినిమాలు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయన్నది పెద్ద ప్రశ్నే. నిత్యావసర వస్తువులైన గ్యాస్, పెట్రోల్ మీద ఉన్న అటెన్షన్ సినిమాలవైపు తీసుకురావాలంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. అందుకోసం దర్శక నిర్మాతలు ఏం చేస్తారో, ఏం చేయగలరో చూడాలి.
