ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్చా వేదికపై జర్నలిస్ట్ వెంకటకృష్ణ , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మధ్య జరిగిన గెటౌట్ వివాదం కొత్త చర్చకు దారితీసింది. టెలివిజన్ చర్చల్లో వాదోపవాదాలు సహజమే అయినప్పటికీ, ఒక జర్నలిస్ట్ తన పరిధిని దాటి అతిథులను వ్యక్తిగతంగా గెటౌట్ అంటూ అరవడం ఆరోగ్యకరమైన ధోరణి కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. చర్చా వేదికను నియంత్రించే అధికారం ఉన్న వ్యక్తికి, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని మైక్ ఆఫ్ చేయడం లేదా స్క్రీన్ నుండి తొలగించే సాంకేతిక వెసులుబాటు ఉంటుంది. కానీ వెంకట కృష్ణ ఇక్కడ అరవడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రం నుండి వచ్చిన వారు, వారికి తమదైన శైలిలో వాదించే అలవాటు ఉంటుంది. అయితే, ఒక చర్చను నడిపించే వ్యక్తి సంయమనం కోల్పోవడం వల్ల చర్చ యొక్క అసలు ఉద్దేశ్యం పక్కదారి పడుతుంది. వెంకటకృష్ణ వ్యవహారంలో ఆయన ఒక రాజకీయ ప్రత్యర్థిలా ప్రవర్తించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులు తాము అడిగే ప్రశ్నల ద్వారా సమాధానాలను రాబట్టాలి తప్ప, అతిథుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం వల్ల మీడియాపై ప్రజల్లో ఉండే విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకుడు చేసింది తప్పే కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడేవాళ్లు తక్కువ.. మీడియా ప్రతినిధిగా అలా మాట్లాడకూడదు. అందుకే ఎక్కువగా ఆ అంశంపై చర్చ జరుగుతోంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఛానళ్లపై నిషేధం విధించిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఛానల్ను బహిష్కరించడం అనేది ఆ పార్టీ నిరసనను తెలియజేస్తోంది. అయితే, ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సింది మీడియా హౌస్ల బాధ్యత గురించి. టీఆర్పీ రేటింగ్ల కోసం డిబేట్లను రణరంగంలా మార్చడం, వ్యక్తిగత విద్వేషాలను ప్రదర్శించడం వల్ల సమాజానికి అందే సందేశం తప్పుగా ఉంటుంది. డిబేట్లు జర్నలిస్టుల వ్యక్తిగత ఇగోలను సంతృప్తి పరుచుకునే వేదిక కాకూడదని అంటున్నారు.
ఈ వివాదం కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి సంబంధించింది కాదనుకోవచ్చు. ఇది డిజిటల్ యుగంలో టెలివిజన్ చర్చల నాణ్యత , జర్నలిస్టుల నైతిక ప్రవర్తనకు సంబంధించిన ఒక హెచ్చరిక లాంటిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
