తమిళనాడులో మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే తన సంక్షేమ పథకాలు, స్టాలిన్ స్టైల్ ప్రచారంతో దూసుకుపోతుండగా, అన్నాడీఎంకే కూటమి కొత్త పార్టీలను చేర్చుకుంటూ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతోంది. అయితే, భారీ అంచనాల మధ్య రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ మాత్రం గత కొన్ని వారాలుగా అనూహ్యమైన మౌనాన్ని పాటిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో కానీ, పొత్తులపై స్పష్టత ఇవ్వడంలో కానీ ఆయన వెనుకబడి ఉన్నారు. ఆయనకు తాజాగా ఈల గుర్తు వచ్చింది. దీంతో ఆయన గోలగోల చేస్తారని .. విజిల్ పోడు అని హంగామా చేస్తారని క్యాడర్ ఆశలు పెట్టుకుంటున్నారు.
వ్యూహాత్మక గందరగోళం?
విజయ్ పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. ఆయన ఇప్పటికే బీజేపీని సైద్ధాంతిక శత్రువు గా, డీఎంకేను రాజకీయ శత్రువు గా ప్రకటించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్ కలిగిన ఈ రెండు పార్టీలను ఒకేసారి ఎదుర్కోవడం అంత సులభం కాదు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుందామంటే, అక్కడ ఈపీఎస్ నాయకత్వాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒంటరిగా వెళ్తే ఓట్లు చీలిపోయి అటు డీఎంకేకు లేదా ఇటు అన్నాడీఎంకేకు లాభం చేకూరుతుందనే ఆందోళన ఉంది. ఈ గందరగోళమే ఆయన మౌనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
అంతర్గత కసరత్తు – కమిటీల నియామకం
బయటకు స్తబ్ధంగా కనిపిస్తున్నప్పటికీ, విజయ్ లోపల పార్టీని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. తాజాగా జనవరి 2026లో ఆయన 10 మంది సభ్యులతో ఎన్నికల ప్రచార కమిటీని, మరో 12 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించారు. కేవలం ఆవేశపూరిత ప్రసంగాల కంటే, పక్కా ప్రణాళికతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. సుమారు 70,000 బూత్ లెవల్ ఏజెంట్లను నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాల్సిన సమయంలో ఈ మౌనం కేడర్లో కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.
అదే బిగ్ ఎక్స్-ఫ్యాక్టర్
తమిళ రాజకీయాల్లో విజయ్ ఇప్పటికీ ఒక పెద్ద ఎక్స్-ఫ్యాక్టర్ . ఆయన సినిమాలకు ఉండే విపరీతమైన క్రేజ్ ఓట్ల రూపంలో మారుతుందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత వంటి వారు సాధించిన అద్భుతాలను విజయ్ రిపీట్ చేస్తారని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. కానీ, డీఎంకే వంటి పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీని ఎదుర్కోవాలంటే కేవలం అభిమానం సరిపోదు, రాజకీయ వ్యూహం కూడా బలంగా ఉండాలి. విజయ్ ఈ మౌనాన్ని వీడి ఈల గుర్తుతో ఎన్నికల వేళ ఏ తరహా మాస్ ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.
