తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే అవకాశాలను టీవీకే విజయ్ చేజార్చుకున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు..ముఖ్యంగా సినిమాల నుంచి వచ్చిన నాయకుడి నుంచి ప్రజలు హీరోయిజం కోరుకుంటారు. తిరుగుబాటు చేసే ధైర్యం ఉండాలని అనుకుంటారు. అలాంటి హీరోయిజం చూపించే అవకాశం రెండు సందర్భాల్లో వచ్చినా రక్షణాత్మక ధోరణితో రాజకీయాలు చేసి సాదాసీదా లీడర్ గా నిలబడిపోయారు.
ప్రజలు కోరుకునే హీరోయిజం ఏది?
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు ప్రాథమిక బలం వారికున్న హీరోయిజం. తెరపై అన్యాయాన్ని ఎదిరించే నాయకుడిని చూసిన ప్రజలు, నిజ జీవితంలోనూ అదే తరహా పోరాట పటిమను కోరుకుంటారు. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపించిన తర్వాత, ప్రజల పక్షాన నిలబడి వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తారని అందరూ భావించారు. అయితే, కీలక సమయాల్లో ఆయన చూపిస్తున్న మౌనంతో కూడిన రక్షణాత్మక ధోరణి ఆయనను ఒక సామాన్య రాజకీయ నాయకుడిగానే చూపిస్తోంది తప్ప, ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టలేకపోతోంది.
కరూర్ ఘటన – చేజారిన మొదటి అవకాశం
కరూర్ తొక్కిసలాట ఘటన వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు, ఒక నాయకుడి అసలైన తత్వమేంటో బయటపడుతుంది. అటువంటి సమయంలో రాజకీయ విమర్శలకు లేదా ప్రభుత్వ విచారణలకు భయపడకుండా, బాధితుల పక్షాన నిలబడి, క్షేత్రస్థాయిలో పోరాడి ఉంటే విజయ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయేది. ప్రజల కోసం జైలుకైనా సిద్ధం అనే తెగింపును ప్రదర్శించాల్సిన చోట, ఆయన వ్యూహాత్మక మౌనం వహించడం, బయటకు రాకపోవడం వల్ల ఆయన కేవలం సేఫ్ జోన్లో ఉండాలనుకుంటున్నారనే సంకేతాలు వెళ్లాయి. ఇది ఆయనను ప్రజానాయకుడిగా మార్చే ఒక గొప్ప అవకాశాన్ని దూరం చేసింది.
జననాయగన్ వివాదం – రెండో అవకాశం మిస్
జననాయగన్ సినిమా విడుదల విషయంలో తలెత్తిన వివాదాలు కూడా విజయ్‌కు మరో అవకాశం కల్పించాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం లేదా ప్రజల గొంతుకగా నిలిచే సినిమా కోసం ఆయన గళమెత్తి ఉంటే యువతలో పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. వ్యవస్థపై రివోల్ట్ అయ్యే ధైర్యం చూపిస్తేనే ప్రజలు వెంట నడుస్తారు. కానీ, ఇక్కడ కూడా రక్షణాత్మక ధోరణిని అవలంబించడం వల్ల, ఆయన కేవలం తన వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణాత్మక ధోరణితో మేలు జరగదు !
రాజకీయాల్లో మౌనం కొన్నిసార్లు ఆయుధమే కావచ్చు, కానీ ప్రారంభ దశలో ఉన్న నాయకుడికి అది మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రత్యర్థులు దాడి చేస్తున్నప్పుడు లేదా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్పందించకపోవడం బలహీనతగా ప్రజలు భావిస్తారు. తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అందరూ ప్రజల కోసం పోరాడి, వ్యవస్థను ఎదిరించి నిలబడిన వారే. విజయ్ కూడా అదే బాటలో నడవాలంటే ఇలాంటి అవకాశాలను వదిలి పెట్టకూడదు.
