ఎవరి హిట్టుకు వారే బాధ్యులు. అలానే ఫ్లాపులకు కూడా. కానీ విచిత్రం ఏమిటంటే.. హిట్టుని సెలబ్రేట్ చేసుకొని, ఫ్లాపుల్ని మాత్రం అనాథగా వదిలేస్తుంటారు. వీలైతే ఫ్లాపుని పక్కవాళ్ల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తన ఫ్లాపుల్ని కూడా తన భుజాలపైనే వేసుకొన్నాడు విశ్వక్ సేన్.
ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది లాంటి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాడు విశ్వక్. తన టైమింగ్ బాగుంటుంది. సినిమా కోసం చాలా కష్టపడతాడు. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేసుకొంటాడు. తనలో నటుడే కాదు, దర్శకుడు కూడా ఉన్నాడు. అయితే ఈమధ్య విశ్వక్ ట్రాక్ తప్పాడు. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. `లైలా` అయితే.. తన కెరీర్ని పది మెట్లు కిందకు దించింది. అయితే ఈ ఫ్లాపుల నుంచి విశ్వక్ పారిపోవడం లేదు. తప్పంతా తనదే అంటున్నాడు. ఒకట్రెండు సినిమాలు తాను స్పృహలో లేకుండా చేశానని, మంచి సినిమాలకు క్రెడిట్ తీసుకొన్నట్టే, తన ఫ్లాపులకు కూడా తాను బాధ్యత వహిస్తున్నానని, హిట్టు కొట్టినప్పుడు ఎలాంటి కండీషన్లు పెట్టకుండా అంతా ఆదరించారని, తన ఫిల్మోగ్రఫీపై ఆడియన్స్ ఒక బాండింగ్ బిల్డ్ చేసుకొన్నారని, అలాంటి వాళ్లకు తప్పు చేసినప్పుడు హెచ్చరించే హక్కు ఉందని చెప్పుకొచ్చాడు. తన ఫ్లాపులు తనకు మేల్కొలుపు అన్నాడు. తాను మళ్లీ ఒకటో నెంబరు నుంచి మొదలు పెడుతున్నానని, ఆ లెక్కన ఫంకీ తన తొలి సినిమా అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు విశ్వక్.
తన మాటల్ని బట్టి చూస్తే విశ్వక్ కాస్త మారినట్టే కనిపిస్తున్నాడు. తప్పులు ఎక్కడ జరిగాయో బేరీజు వేసుకొన్నప్పుడు.. మళ్లీ ఆ తప్పుల్ని పునరావృతం చేసే ఛాన్స్ ఉండదు. విశ్వక్ కూడా అదే చేశాడనిపిస్తోంది. ‘ఫంకీ’పై తనకు చాలా ఆశలు ఉన్నాయి. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో తాను గాడిలో పడతాడేమో చూడాలి.
