ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు ఎవరు?
అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఆన్సన్ చెప్పొచ్చు. ఎస్.ఎస్.రాజమౌళి అని. ఇప్పుడు దురంధర్ 1, 2లు తీసి `బాహుబలి` రికార్డుల్ని కూడా బీట్ చేసిన ఆదిత్య ధార్ సైతం ఈగోని పక్కనపెట్టి, నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరే చెబుతాడు. చెప్పాలి కూడా.
అవును.. ‘దురంధర్’ రాజమౌళి సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టింది. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇండియాలో అత్యధిక కలక్షన్లు వసూలు చేసిన సినిమాని ఆదిత్యా ధార్ అనే దర్శకుడు తీశాడు. రెండోస్థానంలో రాజమౌళి ఉన్నాడు. అయినా.. ఇప్పటికీ రాజమౌళినే నెంబర్ వన్. ఎందుకంటే ఒక్క సినిమాతో మారిపోయే స్థానం కాదు రాజమౌళిది.
కానీ ఒక్కటి మాత్రం నిజం. రాజమౌళికి గట్టి పోటీ ఉంది. వసూళ్ల పరంగా రాజమౌళి ఎంత గొప్ప సినిమా అయినా తీస్తాడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దాన్ని బీట్ చేసే సినిమా వస్తూనే ఉంటుంది. రావాలి కూడా. బ్రాడ్ మెన్ కంటే గొప్పోడు లేడనుకొన్నప్పుడు సచిన్ వచ్చాడు. సచిన్ రికార్డులు పదిలం అనుకొంటున్నప్పుడు కోహ్లీ వచ్చి వాటిని బ్రేక్ చేశాడు. రేపు.. మరో క్రికెటర్. సినిమా కూడా అంతే.
రాజమౌళిది అపజయం ఎరుగని జైత్ర యాత్ర. ఆ రికార్డు ఎప్పటికీ పదిలమే. ఎప్పుడు ఎవరితో సినిమా తీసినా.. ఇండస్ట్రీ రికార్డుల్ని కొత్తగా రాస్తాడు. ఇప్పటి దురంధర్ రికార్డులు కూడా శాశ్వతం కాదు. రాజమౌళి తీసే ‘వారణాసి’కి ఈ రికార్డుల్ని తిరగరాసే సత్తా ఉంది. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఎప్పుడైనా రెండు వేల కోట్ల సినిమాలు తీయగలరు.. తీసి చూపించగలరు. వీళ్లందరూ రాజమౌళికి పోటీనే. వీళ్లే అని కాదు. ఆడిటోరియాన్ని షేక్ చేసి, ఇండియా మొత్తం ఊపేసేలా ఓ కథ చెప్పే ఏ దర్శకుడైనా ఓ గొప్ప సినిమా తీయగలడు.
వసూళ్ల విషయం పక్కన పెడితే సినిమా స్థాయిని, సాంకేతికతని, సినిమా చూసే ప్రేక్షకుడి అనుభూతి తాలుకా తీవ్రతని పెంచే దర్శకుడు వీళ్లలో నిస్సందేహంగా రాజమౌళినే. సినిమాని ప్రమోట్ చేసుకొనే విషయంలో కూడా ఆయనకు తిరుగులేదు. సినిమా సినిమాకీ తనను తాను పెంచుకొంటూపోతున్నాడు. ఆ పరుగు ఎక్కడ ఆగుతుందో కూడా తెలీదు. ఈ విషయంలో ఆయన్ని కొట్టేవాడే లేడు.


