“కవిత వ్యవహారంపై ఎవరూ మాట్లాడకండి.. ఈ ఇష్యూను నేనే డీల్ చేస్తా.. కేటీఆర్ తో కేసీఆర్ చెప్పిన మాట”. కేసీఆర్ తో భేటీకి ముందురోజు కేటీఆర్ పరోక్షంగా కవితకు కౌంటర్ ఇవ్వడంతో కొడుకు ద్వారా పార్టీ శ్రేణులకు కేసీఆర్ పంపిన సందేశం ఇది. కవిత రాజకీయాలను కేసీఆర్ ఓ కంటగమనిస్తున్నప్పటికీ ఆమె మాత్రం తన రాజకీయాలను తాను చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఇష్యూ చేజారిపోతుందని అనుకున్నారో ఏమో, అనూహ్యంగా ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగడంతో మామనే అల్లుడికి టాస్క్ అప్పగించారా? అనేది చర్చనీయంశంగా మారింది.
హరీష్ రావు.. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్. ఇలా ఆయన్ను ఊరికే అనలేదు. బీఆర్ఎస్ ఎదుర్కొన్న అనేక సంక్షోభాలను హరీష్ రావు పరిష్కరించడంతోనే ఆయనను ట్రబుల్ షూటర్ అని అంటుంటారు. పార్టీకి ఎప్పుడు, ఎలాంటి సమస్య వచ్చినా కేసీఆర్ కు మొదట గుర్తుకువచ్చేది హరీషే. ఇప్పుడు కవిత వ్యవహారంలోనూ కేసీఆర్ మళ్లీ హరీష్ రావేను రంగంలోకి దింపారు అనే టాక్ వినిపిస్తోంది.
పార్టీలో కవిత రాజేసిన అంతర్గత సంక్షోభంపై ఎవరూ మాట్లాడవద్దని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఎవరూ కవిత ఇష్యూపై మీడియా ప్రశ్నించినా నోరు తెరవడం లేదు. డిబేట్లకు పిలిచినా తాము రామంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. కానీ, సడెన్ గా హరీష్ రావు ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర చేశారని కవిత ఇటీవల వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, కలుస్తదని కొందరు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై కేసీఆర్ ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 100 స్థానాల్లో పైగా విజయం సాధించి అధికారంలోకి వస్తామన్నారు.
కవిత వ్యాఖ్యల పట్ల ఎవరూ స్పందించవద్దని కేసీఆర్ ఆదేశించినప్పటికీ కవితకు కౌంటర్ ఇచ్చారంటే…హరీష్ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ గీతను దాటరు. అట్లాంటి నేత ఇప్పుడు కవిత గురించి మాట్లాడారంటే దాని వెనక కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కవిత చేసిన విలీనం వ్యాఖ్యలను ఎవరూ ఖండించకపోతే.. అదే నిజమని అనుకుంటారని అందుకే ఈ విషయంలో కౌంటర్ ఇవ్వాలని హరీష్ రావును కేసీఆర్ రంగంలోకి దింపారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా.. ఇది ఫ్యామిలీ వ్యవహారంగా కూడా మారడంతో కేటీఆర్ కన్నా అల్లుడితోనే కౌంటర్ ఇప్పించాలని ఆయన్ను రంగంలోకి దించారని అంటున్నారు.
