అసెంబ్లీ స‌మావేశాల‌పై జ‌గ‌న్ కు బాధ్య‌త లేదా..?

ఏపీ అసెంబ్లీ జ‌రుగుతున్న తీరుపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆవేద‌న చెందారు..! నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో అన్నింటా అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. పెద‌కూర‌పాడులో జ‌రిగిన పాద‌యాత్ర‌లో ఆయ‌న టీడీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు. వైకాపా ఎమ్మెల్యేల‌ను ఒక్కొక్క‌రికీ రూ. 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారంటూ ముఖ్య‌మంత్రిపై ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో న‌లుగురు వైకాపా మంత్రులు ఉన్నార‌నీ, చ‌ట్టాల‌కు తూట్లు పొడిచే విధంగా ఇవాళ్ల అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డ్డారు. ఒక గ‌జ‌దొంగే అసెంబ్లీని న‌డుపుతున్న‌ట్టుగా ఉందంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

మొన్న‌టికి మొన్న‌, వైకాపా ఎంపీ విజ‌యసాయి రెడ్డి కూడా ఇలానే ముఖ్య‌మంత్రిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. గ‌జ‌దొంగ చార్లెస్ శోభ‌రాజుతో పోల్చుతా అన్నారు. విజ‌య‌సాయి కూడా అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న తీరును ఎద్దేవా చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌భ‌లో లేకుండా జ‌రిగే స‌మావేశాల‌కు అర్థం ఉండ‌ద‌న్నారు. గంట‌ల‌కొద్దీ ముఖ్య‌మంత్రి మాట్లాడుతున్నార‌నీ, ప్ర‌తిప‌క్షం స‌భ‌లో లేక‌పోతే అది టీడీఎల్పీ స‌మావేశం అవుతుంద‌నీ, దాన్లో ఎంత‌సేపైనా సొంత డ‌బ్బా కొట్టుకోవ‌చ్చ‌ని ఆయ‌న కూడా ఆరోపించారు.

నిజానికి, వైకాపా స‌భ్యుల‌ను స‌భ‌కు రావొద్ద‌ని ఎవ‌రైనా చెప్పారా..? మొత్తంగా ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యులంద‌రినీ స‌భ స‌స్పెండ్ చేసిందా..? అలాంటిదేం లేదు క‌దా! స‌భ‌లో దొంగ‌లున్నారు, చట్టాలకు తూట్లు పడిపోతున్న పరిస్థితి ఉందీ, స‌భ‌లో అన్యాయం జ‌రిగిపోతోంద‌ని బ‌య‌ట వాపోయే బ‌దులు… స‌భ‌కి వ‌చ్చి, అధికార పార్టీ తీరును ఎండ‌గ‌ట్టొచ్చు క‌దా! అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌న్న‌ది ఒక స‌భ్యుడి క‌నీస బాధ్య‌త‌. దాన్ని విస్మ‌రించి.. స‌భ జ‌రిగే తీరు బాలేదు, టీడీపీ ఎల్పీ మీటింగులా ఉందీ అంటూ మాట్లాడే అర్హ‌త వైకాపా నేత‌ల‌కు ఉందా..? ఫిరాయింపు నేత‌ల‌పై చ‌ర్య‌లు అవ‌స‌ర‌మే. కానీ, చ‌ర్య‌లు తీసుకునే విధంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలంటే అసెంబ్లీ వేదిక‌గా పోరాటాలు చెయ్యాలి. అంతేగానీ.. స‌భ బ‌య‌ట మాట్లాడ‌తామంటే ఏం ఉప‌యోగం..? ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మాట్లాడితే ఏం ప్ర‌యోజ‌నం..? ఆ స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీ మాట్లాడండ‌య్యా బాబూ అంటూ ప్ర‌జ‌లే క‌దా వారిని స‌భ‌కు పంపింది..! అసెంబ్లీకి రావాల్సిన క‌నీస బాధ్య‌త ప్ర‌తిప‌క్ష నేత‌కు ఉంటుంది. కానీ, ఆయ‌న పాద‌యాత్ర‌కు భంగం క‌లుగ‌కూడ‌ద‌ని ఏకంగా అసెంబ్లీ స‌మావేశాల‌నే బ‌హిష్క‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌గ‌న్ ముందున్న ల‌క్ష్యం. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష నేత‌గా నిర్వ‌ర్తించాల్సిన క‌నీస బాధ్య‌త‌ల్ని ఆయ‌న ఏనాడో వ‌దిలేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com