భారతీయ జనతా పార్టీని పట్టుకుని వదిలి పెట్టని జగన్ రెడ్డికి పార్లమెంటులో అమరావతి రాజధాని అంశంపై జరిగిన చర్చ గట్టి హెచ్చరిక లాంటిది. గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడిగిన ప్రతి బిల్లుకు, ప్రతి నిర్ణయానికి బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీని పిల్ల కాంగ్రెస్‌గా తేల్చారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ అగ్రనేతలు లక్ష్మణ్ వంటి వారు వైసీపీని పిల్ల కాంగ్రెస్ అని సంబోధించడం, ఆ పార్టీకి కనీస రాజకీయ గౌరవం ఇవ్వకపోవడం చూస్తే.. ఆయనకు ఉన్న విలువ లఏ పాటిల్ అర్థమైపోతుంది.
వ్యక్తిగత రక్షణ కోసం పార్టీ ప్రయోజనాల తాకట్టు:
జగన్ రెడ్డి తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు , ఇతర న్యాయపరమైన చిక్కుల నుండి రక్షణ పొందడమే పరమావధిగా బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. తాత్కాలిక అవసరాల కోసం ఆయన రాష్ట్ర ప్రయోజనాలను, పార్టీ సిద్ధాంతాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారనేది బహిరంగ రహస్యం. అయితే, ఈ వ్యూహం ఆయనను వ్యక్తిగతంగా కొంతకాలం కాపాడి ఉండవచ్చు కానీ, క్షేత్రస్థాయిలో పార్టీకి తీరని నష్టం చేకూరుస్తోంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మైనారిటీలు, దళితులు , సెక్యులర్ ఓటర్లు ఇప్పుడు వైసీపీ వైఖరిని చూసి ఆ పార్టీకి దూరమవుతున్నారు. అర్థమైనా అర్థం కానట్లుగా నటిస్తూ జగన్ సాగిస్తున్న ఈ ప్రయాణం చివరకు వైసీపీని రాజకీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
పోరాట పటిమ లోపించిన ప్రతిపక్షం
రాజకీయాల్లో ఏ పార్టీకైనా అస్తిత్వం అనేది పోరాటాల ద్వారానే వస్తుంది. కానీ, జగన్ రెడ్డి మాత్రం కేంద్రంపై పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల విషయంలో కేంద్రం మొండిచేయి చూపినా, వైసీపీ మాత్రం మౌనంగానే ఉండిపోయింది. ప్రజల పక్షాన నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారు. ఇప్పుడు ఓడిపోయాక కూడా ఆయన అంతే. పోరాడితే పోయేదేమీ లేదు కానీ, ఇలా లొంగిపోయి ఉండటం వల్ల సొంత ఓటు బ్యాంకు కూడా ఆయనపై నమ్మకాన్ని కోల్పోతోంది. కేంద్రం తమను ఛీత్కరించుకుంటున్నా, ఇంకా వారి వెంటే వెళ్లడం అనేది ఆత్మగౌరవాన్ని వదిలేయడమేనని కార్యకర్తలు సైతం లోలోపల మదనపడుతున్నారు.
తిరగబడితేనే మనుగడ
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, జగన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలంటే బీజేపీపై రాజీలేని పోరాటం ప్రకటించాల్సిందే. కేసులు వస్తాయనో, కేంద్రం ఆగ్రహిస్తుందనో భయపడితే ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోయే ప్రమాదం ఉంది. కేవలం ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రాకులాడకుండా, ప్రజల గొంతుకగా మారి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తేనే ఆయన ఓటు బ్యాంకు మళ్లీ ఆయనను నమ్ముతుంది. అస్తిత్వం కోల్పోయిన తర్వాత అధికారం కోసం ప్రయత్నించడం వృథా అని జగన్ గుర్తించాలి. బీజేపీపై తిరగబడి, రాష్ట్ర ఆత్మగౌరవం కోసం నిలబడితేనే వైసీపీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుంది, లేనిపక్షంలో ఆ పార్టీ రాజకీయ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.
