ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ సమయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. అధికార కూటమి దౌర్జన్యాలు చేస్తోందని, శాంతిభద్రతలు క్షీణించాయని సాకులు చెబుతూ ఎన్నికలను బహిష్కరించాలన్న ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పోరాడాల్సిన ప్రతిపక్షం ఇలా ముందే చేతులెత్తేయడం అంటే.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను నిలువునా వంచించడమే . యుద్ధం చేయకుండానే వెన్నుచూపడం అంటే అది ఓటమిని అంగీకరించడమే కాక, పార్టీ ఉనికినే ప్రమాదంలో పడేయడం.
జగన్ నిర్వహించినట్లుగా ఎన్నికలు జరపరు!
గతంలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా, బలవంతపు ఏకగ్రీవాలతో ఎలా నిర్వహించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉన్న ప్రభుత్వం. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడంలో ఈ ప్రభుత్వం వెనకాడదు. దౌర్జన్యాలు జరుగుతున్నాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చెబుతున్న సాకులు మాత్రమే. నిజంగా ప్రజల మద్దతు ఉంటే, ఎన్నికల బరిలోకి దిగి కూటమి ప్రభుత్వంపై తమ పోరాటాన్ని సాగించాలి తప్ప, ఇలా పారిపోవడం ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.
ఎన్నికలు బహిష్కరిస్తే ఇతర పార్టీల్లోకి క్యాడర్
వైసీపీ ఒకవేళ ఎన్నికలను బహిష్కరిస్తే, అది ఆ పార్టీ క్యాడర్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. స్థానిక నాయకులు, కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వేరే దారి చూసుకోవడం ఖాయం. ఇప్పటికే జనసేన, బీజేపీ , టీడీపీల్లోకి భారీగా వలసలు సాగుతున్నాయి. ఎన్నికలు లేకపోతే ఇక పార్టీలో ఉండి ఏం చేస్తామన్న భావన స్థానిక నేతల్లో బలంగా నాటుకుపోతుంది. ఇలాంటి నిర్ణయం వల్ల వైసీపీకి ఉన్న కొద్దిపాటి పట్టు కూడా చేజారిపోయి, పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నైతిక స్థైర్యం కోల్పోయిన సైన్యం యుద్ధం చేయలేదన్న సత్యం జగన్ రెడ్డికి చివరికి అర్థం అవుతుంది.
పోరాడలేని రాజకీయం చేస్తే ఏమి.. చేయకపోతే ఏమి?
అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పారిపోవడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ప్రజల నాడిని పట్టుకోవడానికి స్థానిక ఎన్నికలే సరైన వేదిక. వాటిని వదిలేసి, ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఒకవేళ ప్రభుత్వం నిజంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే, అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు. కానీ, కనీసం పోటీ కూడా చేయకుండా దౌర్జన్యం అని సాకులు చెప్పడం అంటే ఓటమి భయంతో వణికిపోతున్నట్లు అర్థం చేసుకుంటారు. అంటే ఇక రాజకీయాల్లో ఉండటం కూడా దండగే.
