ఏపీ పట్ల కొన్ని మీడియా చానళ్లు అత్యంత దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నాయి. అసాంఘిక రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీతో కలిసి కుట్రలు చేస్తున్నాయి. గత పదేళ్ల నుంచి ఇవి సాగుతున్నాయి. ఇప్పుడూ ఆగడం లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న బూతు రాజకీయాలు, విధ్వంసకర విధానాలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మారాయి. ప్రజలు మార్పును కోరుకుని చంద్రబాబు నాయకత్వానికి పట్టం కట్టినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పద్ధతి మార్చుకోకుండా మళ్లీ అదే తరహా కులచిచ్చుకు కుట్రలు పన్నింది.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా, ప్రస్తుతం వైసీపీ చేస్తున్న అసాంఘిక రాజకీయాలకు వంత పాడుతూ కుట్రల్లో బాగం ాఅవుతోంది. అసాంఘిక శక్తులుగా మారుతున్న రాజకీయ నాయకుల తీరును ప్రశ్నించాల్సింది పోయి, వారి బూతు పురాణాలకు, విద్వేషపూరిత వ్యాఖ్యలకు కొన్ని ఛానళ్లు భారీ ప్రచారం కల్పిస్తున్నాయి. రాజకీయాల్లో ఈ విధ్వంసం ఏమిటి? ఈ భాష ఏమిటి? అని గట్టిగా నిలదీయాల్సిన మీడియా.. ఆ రాజకీయ పార్టీ నుంచి లబ్ది పొంది వారి అలజడి కుట్రలకు సాయం చేస్తోంది.
ముఖ్యంగా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా సాగుతున్న రాజకీయాలకు మీడియా వేదికగా మారుతోంది. అంబటి వంటి నాయకులు చేసే ఘోరమైన పనులకు కులాలను ఆపాదించేందుకు ఈ మీడియా సహకరిస్తోంది. విభజన వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, వాటికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగేలా ప్రవర్తించడం ఘోరమైన విషయం. ఒక రకంగా చెప్పాలంటే, ఏపీలో జరుగుతున్న ఈ కుల యుద్ధం వెనుక రాజకీయ నాయకుల కంటే, ఆ వార్తలను వండి వారుస్తున్న కొన్ని మీడియా సంస్థల పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది.
రాజకీయాలు గడప దాటి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకున్న వేళ, మీడియా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతోంది. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, కేవలం ఒక వర్గానికో లేదా ఒక పార్టీకో కొమ్ముకాస్తూ కుల చిచ్చు పెడుతున్న వార్తా సంస్థలను ప్రజలే బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వినాశకర పోకడలను అడ్డుకోకపోతే, రాష్ట్ర భవిష్యత్తు , సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ ఇలాంటి రాజకీయాలతో తీవ్రంగా నష్టపోయింది.
