మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది. కోర్టు ఆదేశాలతో చివరిగా ఇద్దరు వ్యక్తులను విచారించిన సీబీఐ అధికారులు, తాజాగా ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అయితే, ఈ నివేదికలో కొత్తగా ఎలాంటి కీలక అంశాలను పొందుపరచలేదని, ఇప్పటి వరకు జరిగిన విచారణతోనే దర్యాప్తును ముగిస్తున్నామని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
కొత్త ఆధారాలు లేవు !
విచారణాధికారులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, గతంలో దాఖలు చేసిన చార్జిషీట్లలోని అంశాలనే తుది నివేదికలోనూ పునరుద్ఘాటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితుల ప్రమేయం మినహా, ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర కోణాలు లేదా కొత్త వ్యక్తుల గురించి ఎలాంటి అదనపు సాక్ష్యాధారాలు లభించలేదని సీబీఐ తేల్చి చెప్పింది. దీంతో ఈ కేసులో ఇకపై తదుపరి విచారణ ఉండబోదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
సందేహాలు అలానే..!
దర్యాప్తు ముగియడంతో, ఈ కేసు చుట్టూ గత కొన్నేళ్లుగా సాగుతున్న అనేక రాజకీయ మరియు వ్యక్తిగత సందేహాలు నివృత్తి కాకుండానే మిగిలిపోయాయి. హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఆర్థిక లావాదేవీల చిక్కుముడులు , తెరవెనుక ఉన్న పెద్దల పాత్రపై సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వివేకా మృతి గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే కొంత మంది ముఖ్య వ్యక్తులకు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. కానీ వాటిపై క్లారిటీ లేదు. విచారించడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం చార్జిషీటులో పేర్కొన్న నిందితులకే శిక్ష పడే అవకాశం ఉందే తప్ప, లోతైన రహస్యాలు వెలుగుచూసే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
కోర్టు తీర్పుపైనే దృష్టి
ఇకపై ఈ కేసులో న్యాయస్థానంలో సాగే ట్రయల్ మాత్రమే కీలకం కానుంది. ఇప్పటి వరకు సీబీఐ సేకరించిన సాక్ష్యాలను, నిందితుల వాదనలను బేరీజు వేసి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. దర్యాప్తు సంస్థ ఇక దర్యాప్తు ముగిసింది అని ప్రకటించినందున బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంది.


