రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఒక వ్యక్తి మాట మీద మాత్రమే కాదు, ఆయన ప్రవర్తన, నైతిక విలువలపై ఆధారపడి ఉంటుంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పదేపదే ప్రజా సమస్యలు , న్యాయం అంటూ ఆకాశమంత డైలాగులు చెబుతుంటే.. సగటు సామాన్యుడికి మాత్రం ఒకే ప్రశ్న ఎదురవుతోంది. సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని నడిరోడ్డుపై నిలబెట్టి, ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఒక నాయకుడు.. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ముందు ఇల్లు చక్కబెట్టుకో, ఆపై ఊరు గెలుచుకో అనే సామెత జగన్ రెడ్డికి ప్రస్తుత తరుణంలో అక్షరాలా వర్తిస్తుంది. కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తెచ్చుకోలేని అసమర్థత, బయటి ప్రపంచానికి మాత్రం తానేదో రక్షకుడినన్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎబ్బెట్టుగా మారుతోంది.
పరిష్కరించుకోవడం అంటే వేధించడం కాదు!
కుటుంబ సమస్యను పరిష్కరించుకోవడం అంటే కూర్చుని మాట్లాడుకోవడం, పంచుకోవడం. కానీ జగన్ రెడ్డి శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తనను వ్యతిరేకించిన రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగానైతే వేధించారో, ఇప్పుడు తన వాటా అడుగుతున్న సొంత చెల్లిని కూడా అదే రీతిలో ఇబ్బంది పెట్టాలని చూడటం ఆయన వికృత మనస్తత్వానికి అద్దం పడుతోంది. రాజకీయ కక్షసాధింపులను గడప దాటించి కన్నతల్లి వరకు తీసుకువెళ్లడం అనేది తెలుగు సంస్కృతికే విరుద్ధం. ఇంట్లోని ఆడబిడ్డలకు న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల గురించి మాట్లాడటాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు.
కుటుంబ వ్యవస్థను గౌరవించని ఏ నాయకుడూ గెలవలేరు!
ఒక నాయకుడి వ్యక్తిత్వం ఆయన అనుచరుల మీద, సమాజం మీద ప్రభావం చూపుతుంది. అధికారమే పరమావధిగా, ఆస్తులే సర్వస్వంగా భావించి కన్నప్రేమను, తోడబుట్టిన అనుబంధాన్ని కాలరాస్తున్న తీరు అత్యంత హేయం. సామాన్యుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పే ముందు, తన సంతకం కోసం వేచి చూస్తున్న తల్లి ఆవేదనను, చెల్లి పోరాటాన్ని జగన్ గుర్తించాలి. కుటుంబ వ్యవస్థను గౌరవించని ఏ రాజకీయ సిద్ధాంతమైనా ప్రజల్లో సుదీర్ఘకాలం నిలబడదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నైతికంగా ఓడిపోయిన నాయకుడిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
నైతికంగా ఓడిపోయిన నాయకుడిని ప్రజలు క్షమించరు
ఇప్పటికైనా జగన్ రెడ్డి తన మొండివైఖరిని వీడాలి. సమస్యను రాజకీయ కోణంలో కాకుండా, మానవీయ కోణంలో చూడటం నేర్చుకోవాలి. తన ఇంటి సమస్యలను పరిష్కరించి, కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చినప్పుడే ఆయనకు ప్రజల సమస్యల గురించి మాట్లాడే అర్హత లభిస్తుంది. అలా కాకుండా, తన ఇల్లు కాలుతుంటే చుట్టుపక్కల వారిని కాపాడుతానని భీకర ప్రతిజ్ఞలు చేయడం చూస్తుంటే.. అది ఆయన ఆత్మవంచనే అవుతుంది. కానీ ఈ ఆత్మవంచన చేసుకోవడానికే జగన్ అలవాటు పడిపోయారు.


