భారతదేశ సాంకేతిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. భవిష్యత్ అవసరాలను శాసించే క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలకు అమరావతి వేదిక కానుంది. ఇందులో భాగంగా, దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించనున్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో పాటు గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఈ అత్యాధునిక కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి.
ప్రపంచ క్వాంటం దినోత్సవం ఏప్రిల్ 14 సందర్భంగా ఈ కేంద్రాలు అందుబాటులోకి రావడం ద్వారా అమరావతి గ్లోబల్ క్వాంటం వ్యాలీగా అవతరించనుంది.
సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే క్వాంటం కంప్యూటర్లు అసాధారణ వేగంతో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలవు. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కోవడంలోనూ, ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడంలోనూ ఇవి కీలకంగా మారనున్నాయి. ఒకవేళ గతంలోనే ఈ సాంకేతికత అందుబాటులో ఉండి ఉంటే, కరోనా వైరస్ కట్టడికి అవసరమైన ఔషధాలను అత్యంత వేగంగా తయారు చేసేవారమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మానవ జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, ప్రాణాంతక వ్యాధులకు లిప్తపాటులో పరిష్కార మార్గాలను అన్వేషించే సామర్థ్యం ఈ కంప్యూటర్లకు ఉంది.
భారతదేశంలో ఇప్పటివరకు క్వాంటం కంప్యూటర్ల తయారీకి అవసరమైన టెస్ట్ బెడ్లు ఎక్కడా అందుబాటులో లేవు. ఇప్పుడు అమరావతిలో ప్రారంభం కానున్న ఈ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ దేశీయంగా క్వాంటం హార్డ్‌వేర్ అభివృద్ధికి ఊపిరి పోయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు ఆంధ్రా గడ్డపై జరగడమే కాకుండా, ప్రపంచ శ్రేణి ఐటీ హబ్‌గా అమరావతి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. మానవాళి మనుగడకు దివ్యౌషధంలా భావిస్తున్న ఈ టెక్నాలజీ భవిష్యత్తులో పాలనలోనూ, వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది.


