మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 50 శాతం సీట్ల పెంపు గురించి ప్రభుత్వం బయట గొప్పగా చెబుతున్నప్పటికీ, ఆ గణాంకాలను అసలు బిల్లులో ఎందుకు పొందుపరచలేదని ఆమె నిలదీశారు. ప్రధాని, హోంమంత్రులు చెప్పే మాటలకు, బిల్లులోని అసలు నిబంధనలకు పొంతన లేదని.. చట్టబద్ధమైన హామీ లేని మాటలకు విలువ ఉండదని ఆమె స్పష్టం చేశారు.
జనాభా గణన , నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కనిమొళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న 2001 రాజ్యాంగపరమైన సమస్యను తొలగించి, దాని స్థానంలో ఎటువంటి స్పష్టమైన ప్రత్యామ్నాయం చూపలేదని ఆమె ఆరోపించారు. జనాభా గణనను ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. అలాగే, డీలిమిటేషన్ కమిషన్ను ఎవరు నియమిస్తారు, వారిపై న్యాయ సమీక్ష ఎందుకు ఉండకూడదనే అంశాలను ఆమె గట్టిగా ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై కనిమొళి ఆందోళన వ్యక్తం చేస్తూ.. జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచినందుకు దక్షిణ భారతదేశాన్ని ఈ కొత్త నిబంధనలు శిక్షించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వీటన్నింటికీ మించి, బిల్లును గెజిట్లో నోటిఫై చేసిన తర్వాత ఇక చర్చలు జరపడంలో అర్థం ఏమిటని, ఇది కేవలం మొక్కుబడి వ్యవహారమేనా అని ఆమె కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. డీఎంకే ప్రశ్నలకు కేంద్రం సమాధానమివ్వాల్సి ఉంది.
