తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి లోక్‌భవన్ వైపే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో జరిపిన భేటీ కీలకంగా మారింది. ప్రధానంగా గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్‌పైనే ఈ చర్చ సాగినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజరుద్దీన్ భవిష్యత్తు ఇప్పుడు గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజరుద్దీన్ అక్టోబర్ 31న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, అంటే ఈ నెల ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆరు నెలల గడువు ముగిసిపోతుంది. ఈ పది రోజుల్లోపు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న అజరుద్దీన్ , కోదండరామ్ ఎమ్మెల్సీ ఫైళ్లను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరారు.
నిజానికి ఈ ఫైల్ గత కొన్ని నెలలుగా లోక్ భవన్లో పెండింగ్‌లో ఉంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నాలుగైదు సార్లు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో అభ్యంతరం లేదని చెప్పడంతో, ఇప్పుడు అంతా గవర్నర్ నిర్ణయంపైనే ఉంది. అజరుద్దీన్‌కు పదవి దక్కకపోతే అది వ్యక్తిగతంగా ఆయనకు ఎంత నష్టమో, రాజకీయంగా రేవంత్ రెడ్డికి అంతకంటే పెద్ద ఇజ్జత్ సమస్యగా మారే అవకాశం ఉంది. తన కేబినెట్లోని ఏకైక ముస్లిం మంత్రిని కాపాడుకోవడానికి రేవంత్ చేయని ప్రయత్నం అంటూ లేదు.
ఒకవేళ ఏప్రిల్ 30లోపు గవర్నర్ ఫైల్‌పై సంతకం చేయకపోతే, అజరుద్దీన్ రాజీనామా చేయడం తప్ప మరో మార్గం ఉండదు. ఇది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఈసారి నేరుగా గవర్నర్ వద్దకే వెళ్లి రాష్ట్రంలోని పరిపాలన, చట్టపరమైన అంశాలను వివరించారు. గవర్నర్ గారు కరుణించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక ఈ నెలాఖరున రాజీనామాల పర్వం మొదలవుతుందా అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.


