మనిషి జీవితంలో అహం అనేది ఒక విషం లాంటిది. అది ఏ స్థాయిలో ఉండాలో, ఎవరి దగ్గర తగ్గించుకోవాలో తెలియకపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కన్నతల్లి విజయమ్మ పట్ల చూపుతున్నది ఈ తరహా ఈగోనే. తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా జగన్‌కు తన ఈగో అడ్డురావడం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వస్తున్నాయి. రక్త సంబంధాల కంటే రాజకీయాలు, ఆస్తులే ముఖ్యమనుకునే వ్యక్తిత్వం ఒక నాయకుడికి మంచిది కాదంటున్నారు.
తల్లి ప్రేమ వర్సెస్ కుమారుడి ద్వేషం
తల్లి మనసు ఎప్పుడూ తన సంతానం క్షేమాన్నే కోరుకుంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం విజయమ్మ పడిన కష్టాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అప్పట్లో అసెంబ్లీలో వైఎస్‌పై బొత్స లాంటి వారి మాటల్ని విని కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గలేదు. కుమారుడు ఏం చెబితే అది చేశారు. రాజకీయాలు తెలియకపోయినా కేవలం తన కుమారుడి కోసం ఆమె పడ్డ శ్రమ సామాన్యమైనది కాదు. నేడు కుటుంబంలో ఆస్తుల గొడవలు ఉన్నా, కుమారుడు తనపై కేసులు వేసినా.. విజయమ్మ మాత్రం జగన్‌ను ఒక దారి తప్పిన కుమారుడిగానే చూస్తున్నారు తప్ప, శత్రువుగా పరిగణించడం లేదు. ఏ వేదికపై కనిపించినా ఆప్యాయంగా హత్తుకుంటూ తన తల్లిప్రేమను చాటుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం ఆమెను కూడా ఒక రాజకీయ ప్రత్యర్థిలా చూడటం ఆయన నైతిక పతనానికి సంకేతంగా కనిపిస్తోంది.
రాజకీయ భవిష్యత్తుపై అహమే దెబ్బ?
వైఎస్ మరణం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయమ్మ పాత్ర ఎంతో కీలకమైనది. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీకి ఆమె ఒక ఆత్మలా నిలబడ్డారు. అలాంటి తల్లిని నేడు పార్టీకి, కుటుంబానికి దూరంగా పెట్టడం ద్వారా జగన్ ప్రజల్లో ఒక ప్రతికూల సందేశాన్ని పంపుతున్నారు. తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేనంత ఈగో ఉన్న వ్యక్తి, రేపు ప్రజల సమస్యల దగ్గర తన అహాన్ని పక్కన పెట్టి ఎలా స్పందిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూర్ఖత్వంతో కూడిన ఈ వైఖరి జగన్ వ్యక్తిగత జీవితాన్నే కాకుండా, ఆయన రాజకీయ భవిష్యత్తును నరకంగా మారుస్తాయి.
ప్రజాక్షేత్రంలో అంచనా వేయలేని వ్యక్తిత్వం
ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిత్వాన్ని ఆయన కుటుంబ సంబంధాలను బట్టి ప్రజలు అంచనా వేస్తుంటారు. కన్నతల్లిని గౌరవించలేని వ్యక్తి దేశాన్ని ఎలా గౌరవిస్తాడనే మాటను ఇప్పుడు ప్రజలు జగన్ విషయంలో చర్చించుకుంటున్నారు. తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలను ఏకాకిని చేసి.. కేవలం అధికారమే పరమావధిగా సాగుతున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. తల్లిని కూడా శత్రువులా చూడటం ఏ తరహా రాజకీయమో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జగన్ తన ఈగోను పక్కన పెట్టి తల్లి ఆశీర్వాదం తీసుకోకపోతే, చరిత్ర ఆయనను ఒక కర్కశమైన పుత్రుడిగానే ముద్ర వేస్తుంది తప్ప, గొప్ప నాయకుడిగా కాదని వైసీపీ శ్రేణులు కూడా నిట్టూర్పు విడుస్తున్నాయి.


