టెక్నాలజీ మనిషి జీవనశైలిని సులభతరం చేయడమే కాకుండా, నైతిక విలువల పతనానికి కూడా ఒక రాజమార్గంలా మారుతోందనడానికి ప్రస్తుత పరిణామాలు అద్దం పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం అనంతపురంలో బయటపడిన లైవ్ న్యూడ్ వీడియో నెట్వర్క్ నుండి తాజాగా తెనాలిలో వెలుగుచూసిన స్ట్రిప్ టాక్ యాప్ బాగోతం వరకు.. అశ్లీలం ఇప్పుడు ఒక వ్యవస్థీకృత ‘సబ్స్క్రిప్షన్’ వ్యాపారంగా రూపాంతరం చెందింది. విదేశీ వెబ్సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని, స్థానిక మహిళలకు ఆశ చూపి , బలహీనతలను వాడుకుని ఈ చీకటి దందాను సాగిస్తున్నారు. కేవలం ఒక క్లిక్ దూరంలో అశ్లీలం అందుబాటులోకి రావడంతో, సమాజంలోని విలువల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది.
అందాలు చూపించే సబ్స్క్రిప్షన్లు
ఈ అశ్లీల ప్రవాహం ఇప్పుడు కేవలం రహస్య వెబ్సైట్లకే పరిమితం కాకుండా, అందరికీ అందుబాటులో ఉండే సోషల్ మీడియా వేదికలకూ పాకింది. ఇన్ స్టాగ్రామ్‌లో పాపులారిటీ ఉన్న యాంకర్లు, నటీమణులు సైతం పెయిడ్ సబ్స్క్రిప్షన్ పేరిట ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విక్రయిస్తున్నారు. బిగ్ బాస్ షోతో గుర్తింపు పొందిన అషూ రెడ్డి , విష్ణుప్రియ వంటి వారు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్‌ను ప్రారంభించడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంచి కంటెంట్ ఇస్తే రాని సబ్స్క్రైబర్లు.. అందాల ప్రదర్శన అంటే మాత్రం వేల సంఖ్యలో ఎందుకు వస్తారు అనే ప్రశ్న సామాజిక విశ్లేషకులను కలచివేస్తోంది. ఇది కేవలం చూపించే వారి తప్పే కాదు, ఆ అశ్లీలానికి డబ్బులు చెల్లించి ప్రోత్సహిస్తున్న సమాజపు వికృత పోకడలకు నిదర్శనం.
అశ్లీలం ప్రసారం నేరం
సాంకేతికంగా చూస్తే, ఈ సబ్స్క్రిప్షన్ మోడల్స్ ఎంటర్టైన్మెంట్ ముసుగులో జరుగుతున్నా, లోపల జరిగేది మాత్రం అశ్లీల ప్రదర్శన అని పోలీసుల విచారణలో తేలుతోంది. తెనాలి కేసులో బయటపడినట్లుగా, ఒక్కో కాల్‌కు మహిళలకు రూ. 500 నుండి రూ. 1000 చెల్లిస్తూ ముఠాలు కోట్లు గడిస్తున్నాయి. ఐటీ చట్టం సెక్షన్ 67, 67A ప్రకారం ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీలాన్ని ప్రసారం చేయడం నేరమైనప్పటికీ, వివిధ యాప్‌లు , ప్రైవేట్ లింకుల ద్వారా ఈ నెట్వర్క్ విస్తరిస్తోంది. ఇలాంటి వ్యవస్థలను కట్టడి చేయడంలో చట్టపరమైన లొసుగులు నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి.
రూల్స్ తేవాల్సిందేనా?
ప్రజల్లో ఉన్న బలహీనతను పెట్టుబడిగా మార్చుకుంటున్న ఈ సబ్స్క్రైబ్డ్ అశ్లీలం వల్ల కుటుంబ వ్యవస్థలు కూడా కుప్పకూలుతున్నాయి. ముఖ్యంగా యువత తమ కష్టార్జితాన్ని ఇలాంటి క్షణికానందాల కోసం ధారబోస్తున్నారు. రెండురోజుల కిందట జ్యోతిసక్సెనా అనే నటి.. ఇరవై వేలుఇస్తే న్యూడ్ చాట్ చేస్తానని ఓ విద్యార్థితో డీల్ కుదుర్చున్న చాట్స్ వైరల్ అయ్యాయి. సమాజంలో నైతికతను కేవలం ఉపన్యాసాలతో కాపాడలేరు. కఠినమైన సాంకేతిక నిబంధనలు , నిరంతర పర్యవేక్షణ అవసరమని స్పష్టమవుతోంది. ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు తమ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు, ప్రభుత్వం ఇలాంటి అనైతిక ఆదాయ వనరులపై పన్నుల పరంగా లేదా చట్టపరంగా ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సమాజంలో మార్పు రావాలి!
ఇది వ్యక్తుల బాధ్యతతో ముడిపడి ఉన్న అంశం. మంచి మాటలకు, విలువైన సమాచారానికి లేని ఆదరణ.. కేవలం నగ్నత్వానికి దక్కుతోందంటే సమాజం ఏ దిశగా వెళ్తోందో ఆలోచించుకోవాలి. అశ్లీలాన్ని ఒక వ్యాపారంగా గుర్తించి గౌరవించడం మొదలుపెడితే, భవిష్యత్ తరాలకు మనం అందించే సంస్కృతి ఏమిటన్నది పెద్ద ప్రశ్నార్థకం. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే చట్టంతో పాటు సామాజిక చైతన్యం కూడా సమానంగా పని చేయాలి.
