యుద్ధానికి సిద్ధంగా ఉండాల‌న్న వాయుసేనాధిప‌తి

భార‌త వాయు సైన్యం చ‌రిత్ర‌లో ఓ అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. చీఫ్ మార్ష‌ల్ బిఎస్ ధ‌నోవా రాసిన లేఖ అరుదైన ఘ‌ట‌న‌గా భావిస్తున్నారు. లేఖ‌లు రాయ‌డం సాధార‌ణ‌మైన‌ప్ప‌టికీ ఒకేసారి 12వేల మంది అధికారుల‌కు పేరుపేరున లేఖాస్త్రాల‌ను సంధించ‌డం కీల‌క‌మైన అంశంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ధ‌నోవా ఆ లేఖ‌లో పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌తో త‌ర‌చూ ఏర్ప‌డుతున్న ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి, కాల్పుల ఉల్లంఘ‌న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండ‌డం, వంటి సంఘ‌ట‌న‌ల‌తో ఆయ‌న అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మార్చి 30న ధ‌నోవా ఈ లేఖ రాశార‌ని ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. జ‌మ్మూ-కాశ్మీర్‌పై నెల‌కొన్న ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి ఈ లేఖ రాయ‌డానికి దారి తీసింది. వాయు సైనిక ద‌ళాల‌లో పెరిగిన ప‌క్ష‌పాతధోర‌ణి, క్యాడ‌ర్ మ‌ధ్య లైంగిక వేధింపుల అంశాల‌ను కూడా ధ‌నోవా లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఇటువంటి వైఖ‌రిని తీవ్రంగా ఖండించాల్సిందేన‌న్నారు. జ‌న‌వ‌రిలో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ త‌ర‌హా లేఖ రాయ‌డం వాయుసేన చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. దేశం ఎదుర్కొంటున్న విష‌మ ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.

1950, 1986 సంవ‌త్స‌రాల్లో సైనికాధిప‌తులు ఇదే త‌ర‌హా లేఖ‌ల‌ను రాశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో యుద్ధ ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ధ‌నోవా అధికారుల‌ను హెచ్చరించారు. ప్ర‌స్తుతమున్న శిబిరాలు, హోదాల‌తోనే ఆప‌రేష‌న్స్ చేప‌ట్ట‌డానికి సిద్ధంగా ఉండాల‌నీ, అందుకు ఎంతో ఎక్కువ స‌మ‌య‌ముండ‌ద‌నీ వివ‌రించారు. ఈ దిశ‌గా శిక్ష‌ణ‌పై దృష్టి సారించాల‌న్నారు.
పాకిస్తాన్ త‌ర‌చూ కాల్పుల‌కు తెగ‌బ‌డుతోంద‌నీ, సైనికులు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. కొద్దిరోజులుగా పాకిస్థాన్ 8సార్లు కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డింద‌ని పేర్కొన్నారు. స‌మీప గ్రామాల నుంచి 1700మందిని ఖాళీ చేయించారు. స‌రిహ‌ద్దులో ఉన్న 26 గ్రామాలపై పాక్ బ‌ల‌గాలు మోర్టార్ల‌తో కాల్పుల‌కు దిగాయి. ఈ అనిశ్చిత ప‌రిస్థితులు యుద్ధానికి దారితీయ‌వ‌చ్చ‌ని ధ‌నోవా హెచ్చ‌రించారు. స్క్వాడ్ర‌న్ లీడ‌ర్లు త‌క్కువ‌గా ఉన్న విష‌యాన్ని కూడా లేఖ‌లో ప్ర‌స్తావించారు. కొత్త‌గా 36 ర‌ఫేల్ జెట్స్‌, తేజా ఫైట‌ర్స్‌కోసం ఒప్పందం కుదుర్చుకున్న‌ప్ప‌టికీ యుద్ధ‌విమానాల సంఖ్య చాల‌ద‌ని ధ‌నోవా తెలిపారు. మిగ్ ఫైట‌ర్స్‌ని వాయుద‌ళం నుంచి తొల‌గించ‌డం దీనికి కార‌ణం.

వాయుద‌ళాధిప‌తి రాసిన ఈ లేఖ‌..దేశం యుద్ధం ముంగిట ఉంద‌ని తెలియ‌జెబుతోంది. దీనికి తోడు కుల‌భూష‌ణ్ జాద‌వ్ అంశం ఉండ‌నే ఉంది. సైన్యం ఈ ర‌క‌మైన నిర్థార‌ణ‌కు రావ‌డానికీ, యుద్ధానికి సంసిద్ధ‌మ‌వుతుండ‌డానికీ ఇదే అస‌లు కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చు.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.