ఎపిలో ఏమైనా చెప్పొచ్చు అమిత్‌జీ…అడగడానికి కెసీఆర్ లేడుగా

తెలంగాణాలో లక్ష కోట్లు అంటూ రౌండ్ ఫిగర్ పాట పాడిన అమిత్ షా ఆంధ్రాలో మాత్రం కేవలం లక్షా డెబ్భై ఐదు వేల కోట్లకే పరిమితమయ్యాడు. నిజానికి అమిత్ షా ఓ గోల్డెన్ అపార్చునిటీ మిస్సయ్యాడు. ఇంతకుముందు లోకల్ బిజెపి నాయకులు, వెంకయ్యనాయుడులాంటి వాళ్ళే రెండు లక్షల కో్ట్ల పైబడిన లెక్కలు చెప్పారు. ఇక ఆ లక్షల కోట్ల నంబర్‌ను పెంచుకుంటూ పోయే ప్రయత్నంలో ఉన్నారు బిజెపి నేతలు. అయితే అమిత్ షా మాత్రం ఎందుకో కాస్త తగ్గి లక్షా డెబ్బై ఐదువేల కోట్లకే పరిమితమయ్యాడు. తెలంగాణాకు లక్ష కోట్లిచ్చాం అన్న అమిత్ షాకు కెసీఆర్ ఇచ్చిన ఘాటు కౌంటర్ దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన నిధుల సంఖ్య విషయంలో ఆచితూచి స్పందించాడు.

అమిత్ షా చెప్పిన లెక్క విషయంలో స్థానిక బిజెపి నేతలు మాత్రం అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. పురంధేశ్వరి, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఆ సంఖ్యను ఎప్పుడో రెండు లక్షల కోట్లు దాటించేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అమిత్ షా ఆ సంఖ్యను లక్షా డెబ్భై ఐదు వేల కోట్లకు తగ్గించడం ఏంటి? ఎంత ఎక్కువ నంబర్ చెప్పినా అడగడానికి ఆంధ్రాలో కెసీఆర్ లేడుగా. అమిత్ షా వారు చంద్రబాబునాయుడికి చాలా క్లోజ్ అని ఆంధ్రప్రదేశ్ జనాలను నమ్మించడానికి బాబు భజన మీడియా పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక చంద్రబాబు, లోకేష్‌లతో సహా టిడిపి నేతలందరూ కూడా అమిత్ షాను ప్రసన్నం చేసుకోవడానికి పడిన కష్టం కనిపిస్తూనే ఉంది. మోడీతో మీటింగ్ తర్వాత నుంచీ వైఎస్ జగన్‌కి కూడా అమిత్ షా శివుడి ముందు నందిలాగే కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా పూర్తిగా మౌనవ్రతం పాటించాడు. కొంత కాలం నుంచీ ట్విట్టర్‌లో అయినా రాజకీయ స్టేట్‌మెంట్స్ ఇస్తూ నేనూ నాయకుడినే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పిట్ట మూతపడిపోవడంతో ఇక పవన్ కూడా స్పందించే అవకాశం లేదు. జనాలను ప్రభావితం చేసే స్థాయి ఉన్న నాయకులందరూ కూడా సాగిలపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి పిచ్చ క్రేజ్ వచ్చేలా అమిత్ షా చాలా చాలా గొప్పగా మాట్లాడేయడం ఖాయమని చాలా మంది భావించారు కానీ అమిత్ షా మాత్రం కాస్త తగ్గాడు. ఆంధ్రాకు ఏదేదో చేసేశాం……ఇంకా ఏదేదో చేసేస్తాం అని గొప్పగా మాటలు చెప్పినా కూడా ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా……ఇంకా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్లు పోతాయని భయపడ్డాడేమో మరి. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఎందుకు ఇవ్వలేదు అంటే బిజెపి, టిడిపి చెప్పిన చిత్రమైన కారణాలు అవే మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com