జ‌గ‌న్ తో ఆనం భేటీ… డిమాండ్ల‌పై స్ప‌ష్ట‌మైన హామీ..!

గ‌త కొన్ని నెల‌లుగా జ‌రుగుతున్న చ‌ర్చే… టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాలో చేర‌తార‌ని. ఇప్ప‌టికే వైకాపా నుంచి బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి నేత‌లు ఆనంతో చ‌ర్చ‌లు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. పార్టీలోకి వ‌స్తే ఆయ‌న‌కు ఇవ్వ‌బోతున్న ప్రాధాన్య‌త‌ను ఇదివరకే ఆనంకు స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో, వైకాపాలోకి వ‌చ్చేందుకు ఆనం కూడా కొన్ని డిమాండ్లు వినిపించిన‌ట్టు టాక్‌. ఆ డిమాండ్ల‌ను వైకాపా నేత‌ల‌కు అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు కాబోతున్న నేప‌థ్యంలో గురువారం హైద‌రాబాద్ వ‌చ్చిన జ‌గ‌న్ ను ఆయ‌న నివాసానికి వెళ్లి, ఆనం క‌లిసి వ‌చ్చారు.

దాదాపు గంట‌కుపైగా ఈ ఇద్ద‌రు నేత‌లూ భేటీ అయ్యారు. దీంతో ఆనం చేరిక కేవ‌లం లాంఛ‌నం మాత్ర‌మే కాబోతోంది. ప్ర‌స్తుతం ఆషాఢ మాసం కాబ‌ట్టి, శ్రావ‌ణంలో మంచి రోజులు చూసుకుని వైకాపాలో ఆనం చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 15 త‌రువాత ఆయ‌న చేరిక ఉండొచ్చ‌ని స‌మాచారం. ఇక‌, గ‌తవారం రోజులుగా.. తాను ఎక్క‌డ్నుంచీ పోటీ చేస్తాన‌నే అంశ‌మే జ‌గ‌న్, ఆనంల మ‌ధ్య ప్ర‌ధానాంశంగా నిలిచింద‌ని స‌మాచారం! ఆత్మ‌కూరు నుంచే తాను బ‌రిలోకి దిగుతానంటూ ఆనం ప‌ట్టుబ‌ట్టార‌ట‌. అయితే, ఇప్ప‌టికే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ఉన్నారు. దీంతో అక్క‌డ ఆనంకి అవ‌కాశం క‌ల్పించడం అంత సులువు కాదు. కాబట్టి, వెంక‌ట‌గిరి నుంచే పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని వైకాపా నుంచి కూడా ఆయ‌న సూచ‌న‌లు వెళ్లాయ‌ట‌. జ‌గ‌న్ తో భేటీ అనంత‌రం ఆయ‌న వెంక‌ట‌గిరి నుంచి పోటీకి ఒప్పుకున్న‌ట్టుగా స‌మాచారం. అంతేకాదు, పార్టీ అధికారంలోకి వ‌స్తే… సీనియ‌ర్ నేత‌గా త‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కూడా జ‌గ‌న్ ను ఆనం కోరిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కూడా జ‌గ‌న్ ఓకే అన‌డంతో ఆనం చేరిక‌కు అన్ని ర‌కాలుగా లైన్లు క్లియ‌ర్ అయిపోయిన‌ట్టు వైకాపా వ‌ర్గాలు అంటున్నాయి.

నేత‌ల చేరిక‌ల విష‌యంలో జ‌గ‌న్ ఎత్తుగ‌డ ఏంటంటే… వైకాపా బ‌ల‌హీనంగా ఉన్న స్థానాల్లోకి ఇత‌ర పార్టీల్లో బ‌లంగా ఉన్న నాయ‌కుల్ని తీసుకొచ్చి నిల‌బెట్ట‌డం! దీని వ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలున్నాయి. ఒక‌టీ… సొంత పార్టీ స్థానిక కేడ‌ర్ నుంచి పెద్ద‌గా వ్య‌తిరేక‌త ఉండ‌దు. కాబ‌ట్టి, అసంతృప్తులు తక్కువ‌గా ఉండే ఛాన్సు ఉంటుంది. రెండోది, బ‌ల‌హీనమైన స్థానాల్లో గెలిస్తే వైకాపాకి ప్ల‌స్‌, ఓడినా ఉన్నది పోయినట్టు కాదు కదా. కాబ‌ట్టి, ఈ వ్యూహం ప్ర‌కారమే ఇక‌పై వైకాపాలో చేరిక‌ల్ని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్న‌ట్టుగా కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, పార్టీలోకి వ‌చ్చే సీనియ‌ర్ల‌కు ప్రాధాన్య‌త అనేది… ఎన్నిక‌ల త‌రువాత మాట‌లు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com