పోల‌వ‌రంపై విపక్షాల విమ‌ర్శ‌ల ప్ర‌యోజ‌న‌మేంటో..!

చిన్న విరామం త‌రువాత… పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో కొంత వేగం మ‌ళ్లీ క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ ప్రాజెక్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఎగువ కాప‌ర్ డ్యామ్ జెట్ డ్రౌటింగ్ ప‌నుల‌ను ప్రారంభించారు. పోల‌వ‌రానికి సంబంధించిన అడ్డంకులు ఒక్కోటిగా తొలుగుతున్నాయ‌నీ, నిధుల విష‌యం ఇక‌పై ఎలాంటి అవాంత‌రాలూ రావ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాపర్ డ్యామ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేసి, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతోనే శ్ర‌మిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. మొత్తానికి, కేంద్రం కూడా ఏపీ విష‌యంలో కొంత సానుకూల‌త వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో పోల‌వ‌రం ప‌నులు జోరుగా ముందుకు సాగుతాయ‌నే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇచ్చిన హామీ ప్ర‌కారం వీలైనంత త్వ‌ర‌గా రైతుల‌కు నీళ్లిచ్చే దిశ‌గా టీడీపీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తుంది. ఇది అధికార పార్టీ ఆశాభావం..!

ఇక‌, ప్ర‌తిప‌క్షం వైకాపాగానీ, ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత‌లుగానీ.. పోల‌వ‌రంపై వీరు వినిపిస్తున్న వాద‌న ద్వారా ఏం ఆశిస్తున్నారు అనేదే ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేత‌లు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు. పోల‌వ‌రం త‌మ బిడ్డ అనీ, తామే పూర్తి చేస్తామ‌ని ర‌ఘువీరా అంటారు. బోలెడంత అవినీతి జ‌రిగింది.. కావాలంటే నిరూపిస్తా అంటూ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల నుంచి చంద్ర‌బాబును త‌ప్పించాల‌ని కేవీపీ రామ‌చంద్ర‌రావు డిమాండ్ చేస్తుంటారు. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ సంగ‌తి అయితే స‌రేసరి..! క‌మిష‌న్ల కోస‌మే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్ర‌బాబు నెత్తినేసుకున్నార‌నీ, ప‌నులు నాసిర‌కంగా జ‌రుగుతున్నాయ‌నీ, అవినీతి ఏరులై పారుతోందంటూ ఆయ‌న మాట్లాడుతుంటారు.

ఇంత‌కీ పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఆరోపణలూ విమర్శల ద్వారా ఈ పార్టీలు ఏం సాధిస్తాయ‌నేదే ప్ర‌శ్న‌..? స‌రే, సీఎం చ‌ంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం వ‌ద్దు..! మ‌రి, క్షేత్ర‌స్థాయిలో ప‌నుల్ని ఎవ‌రు ప‌ర్య‌వేక్షిస్తారూ.. కాంగ్రెస్ నేత‌లా, వైకాపా నేత‌లా..? ఒకవేళ రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోతే… ‘అదిగో పట్టించుకోవడం లేదూ’ అంటూ మళ్లీ వారే విమర్శిస్తారు కదా. స‌రే… కేంద్ర‌మే స్వ‌యంగా బాధ్య‌త‌లు తీసుకోవాలంటారు. అప్పుడు ప‌నులు వేగంగా జ‌రుగుతాయ‌ని వీరు భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌రా.. అదీ లేదు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో నిర్మిత‌మౌతున్న జాతీయ ప్రాజెక్టుల తీరు ఎలా ఉందో వారికీ తెలుసు. అవినీతి జ‌రిగిపోయిందీ, క‌మిష‌న్ల క‌క్కుర్తి పెరిగిపోయింది అంటున్నారు. అవేవో ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడితే బాగుంటుంది క‌దా! అప్పుడే కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది క‌దా. ఈ విమ‌ర్శ‌ల అంతిమ ల‌క్ష్య‌మేంట‌నేది క‌నీసం వారికైనా కొంత స్ప‌ష్ట‌త ఉంటే మంచిది. కేవ‌లం టీడీపీకి ప్ర‌తిష్ట ద‌క్క‌కూడ‌ద‌న్న కోణ‌మే ఈ పార్టీల వాద‌న‌లో వినిపిస్తోంది త‌ప్ప‌… అంత‌కుమించిన ప్ర‌జా ప్రయోజ‌నాలు అనే అంశం వీరి ప‌రిగ‌ణ‌న‌లో క‌నిపించ‌డం లేదు. కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ది కోణ‌మే ఈ పార్టీల‌ది అన్న‌ట్టుగా ఉంది. పోల‌వ‌రం త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని వైకాపా, కాంగ్రెస్ లు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ స‌ర్కారు కూడా అదే ప్ర‌య‌త్నంలో ఉంది క‌దా! ఒక‌వేళ పోల‌వ‌రాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేసి ఉంటే… అప్పుడు విమ‌ర్శించినా అర్థ‌ముండేది..? పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌వ్వాలి, కానీ చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ప‌నులు జ‌ర‌క్కూడ‌దు! ఇదెలా సాధ్యమ‌నేది విప‌క్షాలు మ‌రింత స్ప‌ష్ట‌త ఇస్తే.. చేస్తున్న విమర్శ‌లు కొంత అర్థ‌వంతంగా వినిపించే అవ‌కాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.