మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాల‌కు ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ..?

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాం. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనాస‌రే… ఆప‌సోపాలు ప‌డితే త‌ప్ప అధికారం ద‌క్కించుకోలేని అనుభ‌వం భాజ‌పాకి ఎదురైంది. పాకిస్థాన్ మొదలుకొని గుజరాత్ స్థానికత వరకూ అన్ని రకాల ఎమోషన్స్ జనం మీద రుద్దేసినా కూడా బొటాబొటీ మెజారిటీ దక్కింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీని ఇచ్చింది. ఆ త‌రువాతే క‌దా… గ్రామీణ భార‌తంలో మోడీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంద‌నీ, అన్ని రాష్ట్రాల నుంచీ నివేదిక‌లు కావాల‌నే ఒక దిద్దుబాటు క‌స‌ర‌త్తు భాజపాలో మొద‌లైంది. దానికి అనుగుణంగానే గ్రామీణులూ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ మోడీ మేనియా రింగులోకి లాక్కురావాల‌నే ప్రయ‌త్నం కేంద్ర బ‌డ్జెట్ లో క‌నిపించింది. స‌రే, ఓప‌క్క బ‌డ్జెట్ మ‌రీ చ‌ప్ప‌గా ఉందంటూ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే… ఇంకోప‌క్క మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాల తీవ్ర‌త రాజ‌స్థాన్ లో చాలా స్ప‌ష్టంగా క‌నిపించింది.

రాజ‌స్థాన్ లో రెండు లోక్ స‌భ, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రాష్ట్రంలో భాజ‌పా అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న‌ది భాజ‌పా స‌ర్కారే. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో సాధార‌ణంగా అధికార పార్టీకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌. ప్ర‌తిప‌క్ష పార్టీ ప్రాతినిధ్యం వ‌హించిన స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా.. అధికార పార్టీల‌దే పైచేయి అవుతూ వ‌చ్చిన సంద‌ర్భాలే ఎక్కువ‌. అయితే, అనూహ్యంగా… రాజస్థాన్ లో జ‌రిగిన ఈ ఉప ఎన్నిక‌ల్లో భాజ‌పా ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ చేతిలో చిత్తుచిత్తుగా భాజ‌పా ఓడిపోయింది. ల‌క్ష‌కు పైగా మెజారిటీతో పార్ల‌మెంటు స్థానాలు, ప‌దివేల‌కు పైగా మెజారిటీతో అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ ద‌క్కించుకుంది. విచిత్రం ఏంటంటే.. అజ్మీర్‌, అల్వార్ పార్ల‌మెంటు, మండ‌ల్ ఘ‌ర్ అసెంబ్లీ సీటు.. ఈ మూడు స్థానాల్లో ఉన్న ప్ర‌తినిధులు చనిపోయాక జ‌రిగిన ఉప ఎన్నిక‌లు ఇవి! కనీసం సానుభూతి ఫ్యాక్ట‌ర్ కూడా ఇక్క‌డ ప‌నిచేయ‌లేదు. అల్వార్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి దాదాపు 2 ల‌క్ష‌ల‌ మెజారిటీ. అజ్మీర్ లో కాంగ్రెస్ ది 84 వేల ఓట్లు మెజారిటీ. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానంలో 12 వేల మెజారిటీ. ఈ ఫ‌లితాల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ‘వెల్ డ‌న్ రాజ‌స్థాన్ కాంగ్రెస్‌. ప్ర‌జ‌లు భాజ‌పాను ఎంత‌గా వ్య‌తిరేకిస్తున్నారు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం’ అంటూ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ ట్వీట్ చేశారు.

ప‌క్క రాష్ట్రం గుజ‌రాత్ లో అతి క‌ష్ట‌మ్మీద అధికారంలోకి వ‌చ్చారు. రాజస్థాన్ లో కూడా వ‌సుంధ‌రా రాజే ఈ స్థానాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. అయినా ఫ‌లితాలు ఇలా ఉన్నాయి. వీటిపై వెంట‌నే నివేదిక తెప్పించుకుంటామ‌ని, విశ్లేషించుకుంటామ‌ని ఢిల్లీ భాజపా పెద్ద‌లు అంటున్నారు. ఓప‌క్క మిత్ర‌ప‌క్షాల‌ను దూరం చేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీలు త‌మ‌పై ఆధార‌ప‌డాల‌నే వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం కోసం మోడీ, అమిత్ షా ద్వ‌యం వ్యూహర‌చ‌న‌లో మునిగి తేలుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్దామ‌ని సిద్ధ‌మైపోతున్నారు, జ‌మిలి ఎన్నిక‌ల‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, వాస్త‌వ ప‌రిస్థితి ఇంకోలా క‌నిపిస్తోంది. ఉత్తరాదిలో మోడీ వ్య‌తిరేకత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్ప‌డానికి ఇది క‌చ్చితంగా మ‌రో ఉదాహ‌ర‌ణ‌. దీన్ని మోడి మేనియాకు వ్య‌తిరేక‌త అనుకుంటారో… లేదంటే, వ‌సుంధ‌ర రాజేపై ప్రజ‌ల అభిప్రాయంగా చూస్తారో మ‌రి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.