ఆంధ్రాలో కాంగ్రెస్ ఆ పార్టీ కంటే బాగుంద‌ట‌..!

నిజ‌మేనండీ… నిజంగానే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి గ‌తంతో పోల్చితే బాగా మెరుగుప‌డింద‌ట‌! ఆ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. అచ్చంగా ఆంధ్రా కాంగ్రెస్ నేత‌లే. ఆ మాట అన్న‌ది ఎవ‌రోతోనే కాదు… సాక్షాత్తూ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతోనే! అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత రాహుల్ గాంధీ క్రియాశీలంగా మారిన సంగ‌తి తెలిసిందే. అన్ని స్థాయిల్లో పార్టీ ప్ర‌క్షాళ‌న‌పై దృష్టి పెడుతున్నారు. పార్టీలో కార్పొరేట్ త‌ర‌హా సంస్కృతిని నింప‌డం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. దీన్లో భాగంగా వార్ రూమ్ భేటీ తాజాగా జ‌రిగింది. ఈ స‌మావేశానికి తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కులూ హాజ‌ర‌య్యారు. వారికి రాహుల్ ఓ ర‌కంగా క్లాస్ తీసుకున్నార‌నే చెప్పాలి. గ‌తంలో మాదిరిగా లాబీయింగులు చేసుకుంటూ పార్టీలో ప‌ద‌వులు ద‌క్కించుకునే ప‌రిస్థితి ఇక ఉండ‌ద‌నీ, నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను నేత‌లు చేరుకోవాల‌నీ, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డేవాళ్ల‌కే అవ‌కాశం అన్నారు. త్వ‌ర‌లోనే సీడ‌బ్ల్యూసీ భేటీ ఉంటుంద‌నీ, ఆ త‌రువాత పార్టీలో అన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని మార్పులు త‌థ్య‌మ‌నే సంకేతాలు ఇచ్చారు.

ఈ స‌మావేశంలో ఆంధ్రాలో పార్టీ పరిస్థితిని నేత‌లు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, రుద్రారాజు వంటివారు రాహుల్ కి వివ‌రించారు. గ‌తంతో పోల్చితే ఆంధ్రాలో కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగుప‌డుతోంద‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి మ‌రింత ప‌టిష్టత ఖాయ‌మ‌నీ, రాష్ట్రంలో భాజ‌పాతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగ్గా ఉందంటూ ఏపీ నేత‌లు రాహుల్ కి రిపోర్టు ఇచ్చినట్టు స‌మాచారం. భాజ‌పా కంటే కాంగ్రెస్ పాల‌నే బాగుంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో మెల్ల‌గా ఇప్పుడు పెరుగుతోంద‌ని స‌ద‌రు నివేదిక‌లో పేర్కొన్నార‌ట‌! మొత్తమ్మీద‌, ఏపీ నేత‌లు గ‌తంతో పోల్చితే బాగా ఉత్సాహంగానే పార్టీ భ‌విష్య‌త్తు గురించి రాహుల్ స‌మ‌క్షంలో మాట్లాడిన‌ట్టు స‌మాచారం.

ముంజేతి కంక‌ణానికి అద్దం ఎందుకు అన్న‌ట్టుగా.. ఆంధ్రాలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇంత ఆశావ‌హంగా ఉందంటే ఎవ‌రు మాత్రం న‌మ్ముతారు చెప్పండీ..! ఇంతకీ, ఏపీలో కాంగ్రెస్ నాయకులేరీ? వారు చేస్తున్న ప్రయత్నాలేవీ..? మ‌రి, ఈ నేత‌లు ఎందుకింత ఉత్సాహం ప్ర‌ద‌ర్శించారంటే… ప‌దవుల‌పై ఆశతో. ఆంధ్రా పీసీసీ అధ్య‌క్షుడి మార్పు త‌థ్య‌మ‌నేది చాన్నాళ్లుగా జరుగుతున్న చ‌ర్చ. త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల్లోనూ నాయ‌క‌త్వ మార్పుపై రాహుల్ స‌మాలోచ‌న‌లు మొద‌లుపెట్టేశారు. కాబ‌ట్టి, ఆంధ్రాలో పార్టీ అద్భుతః అనే ప్రెజెంటేష‌న్ ఇవ్వ‌డం ద్వారా.. ఏపీ నేత‌లు బాగా ప‌నిచేస్తున్నార‌నే అభిప్రాయం కలిగించడం, సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్న పార్టీకి పున‌రుజ్జీవం కల్పించగల చొర‌వ త‌మ‌లో ఉంద‌నే ప్ర‌ద‌ర్శ‌న మాత్ర‌మే ఈ నివేదిక‌ల్లో క‌నిపిస్తోంద‌ని చెప్పొచ్చు. ఈ ప్ర‌య‌త్నాన్ని రాహుల్ అర్థం చేసుకోలేర‌ని అనుకోలేం క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.