ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. జయమంగళ వెంకటరమణ తన రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకెళ్లారు. విచారణ తర్వాత ఇప్పుడు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని మండలి చైర్మన్ కోర్టుకు చెప్పారు.
ఆయనతో పాటు రాజీనామాలు సమర్పించిన ఇతర ఎమ్మెల్సీల విషయంలోనూ ఒకేసారి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తూ, చట్టపరమైన చిక్కులు రాకుండా చైర్మన్ అడుగులు వేస్తున్నారు. చాలా కాలంగాఎమ్మెల్సీల రాజీనామాలు పెండింగ్లో ఉండటంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగాయి. బతిమాలుకుని అయినా వారిని పార్టీలో ఉంచుకుందామనుకున్నారు. కానీ ఎవరూ తగ్గలేదు. తెలంగాణలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను, అక్కడ నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, ఇక్కడ కూడా ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలతో వ్యక్తిగత విచారణను కూడా మండలి చైర్మన్ పూర్తి చేశారు. ఈ విచారణ సందర్భంగా జయమంగళ వెంకటరమణతో పాటు ఇతర సభ్యులు కూడా తాము స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని, ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పార్టీ మారాక నైతిక విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేశామని, వాటిని వెంటనే ఆమోదించాలని వారు కోరారు. సభ్యులందరూ తమ రాజీనామాలకే కట్టుబడి ఉన్నట్లు లిఖితపూర్వక వాంగ్మూలాలు ఇవ్వడంతో, చైర్మన్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వచ్చే మూడు వారాల్లో ఈ ప్రక్రియ మొత్తం ఒక కొలిక్కి రానుంది. ఒకవేళ ఈ రాజీనామాలు ఆమోదం పొందితే, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఒక్కటి కూడా మళ్లీ వైసీపీకి దక్కే అవకాశాలు లేవు.


