కేసీఆర్ కుటుంబానికి కులం ఉంట‌దా..?

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన ఆరోప‌ణ‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెర తీశాయి. మంత్రి కేటీఆర్ భార్య‌ది ఏ కులం, ఏ వ‌ర్గ‌మో తెలంగాణ స‌మాజానికి స్ప‌ష్టంగా చెప్పాల్సి ఉందంటూ రేవంత్ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేటీఆర్ మామ ఎస్టీ కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రంతో ప్ర‌భుత్వం ఉద్యోగం సంపాదించుకున్నార‌నీ, ఉద్యోగ విర‌మ‌ణ చేసిన త‌రువాత కూడా ఎస్టీ పేరుతోనే పెన్ష‌న్ కూడా తీసుకుంటున్నార‌ని చెప్పారు. ఇది నిజామా కాదా అంటూ, స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ, త‌న వ్యాఖ్య‌లకు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని రేవంత్ స‌వాల్ చేశారు. దీనిపై స‌హ‌జంగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవ‌రైనా స్పందిస్తార‌ని అనుకున్నాం. కానీ, తెరాస నాయ‌కుడు బాల్క సుమ‌న్ స్పందించారు!

కేసీఆర్ కుటుంబంపై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేస్తే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇష్టం ఉండ‌ద‌నీ, అందుకే గత ఎన్నిక‌ల్లో ఆ పార్టీని బొంద‌పెట్టార‌ని సుమన్ అన్నారు. ‘కేసీఆర్ కు గానీ, ఆయ‌న కుటుంబానికి కూడా కులం ఉంటదా..? తెలంగాణ‌నే కేసీఆర్ కులం. తెలంగాణ‌నే కేసీఆర్ మ‌తం. అలాంటి కుటుంబానికి కులం, మ‌తం అంటగట్టి మాట్లాడం స‌మంజ‌సం కాదు’ అని సుమ‌న్ చెప్పారు. వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిల‌వ‌డం కోసం రేవంత్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. కేసీఆర్ గారి అభిమానులు కోట్ల‌ల్లో ఉన్నార‌నీ, ఇలా మాట్లాడితే రేవంత్ ను ప‌ట్టుకుని ఫినాయిల్ తో ఆయ‌న నోటిని క‌డిగేస్తార‌ని సుమ‌న్ హెచ్చ‌రించారు.

‘కేసీఆర్ కుటుంబానికి కులం ఉంట‌దా’ అని ప్ర‌శ్నించ‌డం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, ప్ర‌స్తుత రాజ‌కీయాల‌న్నీ కుల ప్రాతిప‌దిక‌నే జ‌రుగుతున్నాయి. కేసీఆర్ పాల‌న కూడా కులాల వారీగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంపైనే శ్ర‌ద్ధ పెడుతున్నారు. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం తెరాస‌కు దూర‌మౌతోంద‌న్న భ‌యంతోనే క‌దా, ఈ మ‌ధ్య క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీతో సానుకూల ధోర‌ణి పెంచుకునేట్టు సంకేతాలు ఇచ్చారు. ఆ చర్చను పొత్తుల వరకూ ప్రోత్సహించారు. ఇదంతా కుల రాజకీయం కాదా..? కుల లెక్క‌ల ఆధారంగానే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా ఇత‌ర పార్టీల నేత‌ల్ని తెరాస‌లోకి తెచ్చుకున్నారు. కేసీఆర్ కు కులం లేక‌పోతే, ఆయ‌న పాల‌న‌లో కూడా ఇలాంటి స‌మీక‌రణాలు క‌నిపించ‌కూడ‌దు. ప‌రిపాల‌న ద‌గ్గ‌ర నుంచీ రాజ‌కీయాల వ‌ర‌కూ ప్ర‌తీ అంశంలోనూ కుల ప్రాతిప‌దిక లేకుండా ఏదైనా జ‌రుగుతోందా..? ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మౌతున్న విష‌యాలే. ఇలాంట‌ప్పుడు, కేసీఆర్ కుటుంబానికి కులం ఉంటుందా, ఆయ‌నది తెలంగాణ కులం అనే వ్యాఖ్య‌లు విన‌డానికి హాస్యాస్పదంగా ఉంటాయి. తెరాస మాత్ర‌మే కాదు, ఇత‌ర పార్టీలు కూడా.. తాము కులాలకు అతీతంగా రాజ‌కీయాలు చేస్తున్నామని ధైర్యంగా చెప్పుకునే ప‌రిస్థితి ఉందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.