కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు సెక్షన్లను మార్పు చేయడం, మరోవైపు నిందితుడు భగీరథ్ కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లో సంచలన విషయాలను ప్రస్తావించడంతో రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు ఆయన పోలీసుల విచారణకు హాజరుకానున్నారు.
సెక్షన్లను మరింత కఠినంగా మార్చిన పోలీసులు
ఈ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసిన అనంతరం పోలీసులు గతంలో ఉన్న సెక్షన్లను ఆల్టర్ చేశారు. తొలుత బిఎన్ఎస్లోని 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 కింద కేసు నమోదు చేయగా, తాజా పరిణామాలతో వాటిని సెక్షన్ 5(1) రెడ్ విత్ సెక్షన్ 6 కిందకు మారుస్తూ కఠిన సెక్షన్లను చేర్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్లయింది.
ఆమె అసలు మైనర్ కాదంటున్న భగీరథ
భగీరథ్ తన మధ్యంతర బెయిల్ పిటిషన్లో బాధితురాలి వయస్సుపై కీలక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బాధితురాలు 18 ఏళ్ల పైబడిన వ్యక్తని, ఆ విషయాన్ని ఆమె స్వయంగా గతంలో అనేకసార్లు తెలిపిందని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా 2021 ఆగస్టు 21న నిర్మల్‌లో జరిగిన ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసు ఛార్జీషీట్‌ను కోర్టు ముందుంచారు. అప్పట్లో మైనర్ డ్రైవింగ్ కేసులో ఆమె వయస్సు 15 ఏళ్లుగా, 9వ తరగతి చదువుతున్నట్లు రికార్డయిందని, ఆ లెక్కన ప్రస్తుతం ఆమె మేజర్ అని వాదిస్తున్నారు. రాజకీయ కారణాల వల్లే ఈ కేసును అల్లినట్లు భగీరథ్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. తన తండ్రి రాజకీయ ప్రత్యర్థులు ఈ ఎఫ్ఐఆర్ను ఆయుధంగా వాడుకుంటున్నారని, కేసు నమోదైన సమయంలో కూడా బాధితురాలి కుటుంబం తనతో స్నేహపూర్వకంగానే ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
నేడు భగీరథ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. ఒకవైపు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వయస్సు ధ్రువీకరణ పత్రాలు , పాత కేసుల రికార్డులను చూపిస్తూ భగీరథ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తప్పు చేస్తే తన కుమారుడు శిక్ష అనుభవిస్తాడన్న బండి సంజయ్
మరో వైపు తన కుమారుడు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడని బండి సంజయ్ తేల్చి చెబుతున్నారు. అయితే తన కుమారుడు తప్పు చేయలేదని చెబుతున్నాడని.. తాము స్నేహితులుగా ఉన్నామని..విడిపోయామని చెబుతున్నాడన్నారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని..ఆ నిప్పు వారినే దహించి వేస్తుందని హెచ్చరించారు. భగీరథ కేసు విషయంలో పోలీసులు ఏమి తేలుస్తారేమో కానీ.. ఆ అమ్మాయి మైనరే కాదని తేలితే మాత్రం… చాలా కుట్రలు జరిగినట్లుగా ఎక్కువ మంది నమ్ముతారు.
