బీహార్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కొత్త మార్గదర్శకాలను అధికారికంగా అమలులోకి తెచ్చింది. ‘బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి 2026 పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా , పాలనాపరమైన క్రమశిక్షణను కాపాడడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
కొత్త నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాలను తెరవడానికి ముందే సంబంధిత శాఖాధికారుల నుండి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. నకిలీ పేర్లు , అజ్ఞాత ఖాతాల ద్వారా పోస్ట్లు చేయడంపై పూర్తి నిషేధం విధించారు. అంతేకాకుండా, వ్యక్తిగత ఖాతాల నిర్వహణకు ప్రభుత్వ ఈమెయిల్ ఐడిలు, అధికారిక మొబైల్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు ,న్యాయస్థానాల తీర్పులపై ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకూడదని నిబంధనలు వివరిస్తున్నాయి. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతుగా , వ్యతిరేకంగా పోస్ట్లు చేయడం, వివాదాస్పద అంశాలపై స్పందించడం కూడా నిషేధించారు. కుల, మత పరమైన సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు.
కార్యాలయాల్లో పని చేసే సమయంలో రీల్స్ చేయడం, వీడియోలు తీయడం , లైవ్ స్ట్రీమింగ్ చేయడంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అధికారిక సమావేశాల దృశ్యాలను , రహస్య పత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ కొత్త రూల్స్ అమలుతో ఉద్యోగులు తమ ఆన్లైన్ ప్రవర్తన పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
