దర్శకుడు బాబీ ఈరోజు షాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ని కలిసిన ఫొటో తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పవన్ వ్యక్తిత్వం గురించీ, ఆయన అందించిన స్ఫూర్తి గురించీ ఆయన వివరించిన విధానం ఫ్యాన్స్ ని ఆకట్టుకొంది. వీరిద్దరి భేటీ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
బాబీ, పవన్ మధ్య ఏం జరిగి ఉంటుంది? వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా ఏమైనా చేస్తున్నారా? అనే విషయాల్ని ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. వీరిద్దరి కాంబోలో ఇది వరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా వచ్చింది. అది ఫ్లాప్. వవన్‌కు బాబీ వీరాభిమాని. తన అభిమాన హీరోతో చేసిన సినిమా సరిగా ఆడలేదన్న బాధ ఆయనకు ఉంది. ఈసారి వడ్డీతో కలిపి ఇచ్చేయాలని ఆయన ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ కలయిక చూడగానే సినిమా ఏమైనా చేస్తున్నారా? అనే ఆసక్తి మొదలైంది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో హిట్టు కొట్టిన బాబీ, ఇప్పుడు చిరుతో మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ని ఆహ్వానించడానికి బాబీ వెళ్లారని తెలుస్తోంది. అయితే పవన్ కు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది నిర్మాతల దగ్గర పవన్ అడ్వాన్సులు తీసుకొన్నారు. వాళ్లకు సినిమా చేసి పెట్టాలి. ఆ ప్రయత్నంలో కొన్ని కథలు వింటున్నారు. బాబీ కూడా వవన్‌కి ఏమైనా కథ చెప్పారా? అనే చర్చ అందుకే మొదలైంది. మరి ఏం జరిగిందో వాళ్లకే తెలియాలి.
