ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబుల్ ల్లో ఒక ఆసుపత్రి సమీపంలో శనివారం సాయంత్రం బాంబు ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడులో 12మంది మరణించగా సుమారు 66 మందికి పైగా సామాన్య ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వానికి అండగా ఉన్న బ్రిటిష్ మరియు అమెరికా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని తాలిబాన్ ఉగ్రవాదులు ఈ బాంబు ప్రేలుడుకి పాల్పడినట్లు తెలుస్తోంది. కొందరు విదేశీయులను తీసుకువెళుతున్న ఒక వాహనం రోడ్డుపై వెళుతుండగా రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ఒక కారులో అమర్చిన బాంబులను రిమోట్ పరికరం ద్వారా పేల్చినట్లు సమాచారం.
కారులో చాలా శక్తివంతమయిన బాంబులను అమర్చి పేల్చడం వలన చుట్టుపక్కల ఉన్న అనేక వాహనాలు క్షణాలలో మంటల్లో మాడి మసయిపోయాయి. ప్రేలుడు సమాచారం అందుకొన్న వెంటనే బ్రిటిష్ మరియు అమెరికా భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ప్రదేశాన్ని చుట్టూ ముట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ నేత ముల్లా ఒమర్ రెండేళ్ళ క్రితమే మరణించినట్లు ప్రకటించింది. అప్పటి నుండి తాలిబన్లు తమ ఉనికిని చాటుకొనేందుకు ఈ విధంగా బాంబు ప్రేలుళ్ళు చేస్తున్నారని ఆఫ్ఘానిస్తాన్ అధికారులు తెలిపారు. కనీ ఇంతవరకు ఈ ప్రేలుళ్ళకు తమదే బాధ్యత అని ఎవరూ ప్రకటించుకోలేదు.