కమల్ హాసన్… నటనలో ఆయన్ని కొట్టేవాడే లేడు. ఆయన చేయని పాత్రంటూ లేదు. వేయలేని వేషమంటూ లేదు. గొప్ప నటనకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేస్తే, దాన్ని కూడా దాటేయగల నటుడు కమల్ హాసన్. ‘నేను కమల్ హాసన్ అంతటి నటుడ్ని’ అని ఎవరైనా చెప్పుకొన్నా ఓవర్ గా ఉంటుంది. కానీ ‘కమల్ కూడా చేయని పాత్రని చేశా’ అనడం ఇంకాస్త ఎక్కువ కాంట్రవర్సీని సృష్టించినట్టు అవుతుంది. జేడీ చక్రవర్తి ఇప్పుడు అదే చేశారు.
సత్య లాంటి సినిమాల్లో జేడీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటుంటారు. ఆయన్ని సరిగా వాడుకోలేదన్నది నిజం. తన క్యాలిబర్ కి సరిపడా పాత్ర వస్తే విజృంభించగలరు. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ సినిమాలో ధర్మ అనే పాత్ర చేశారు జేడీ. ఇలాంటి పాత్ర రావడం తన అదృష్టం అని, తాను కూడా ఆశ్చర్యపోయేలా ఈ పాత్రని తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకొంటూ ‘కమల్ హాసన్ కూడా ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు’ అనే ఓ స్టేట్మెంట్ విసిరారు. ఇలాంటి స్టేట్ మెంట్లు కాంట్రవర్సీ అవుతుంటాయి. అందుకే.. కాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.
”వరల్డ్ సినిమా హిస్టరీలో కమల్ ని మించిన నటుడు లేడు. నేను ఆయన కాలి గోటికి కూడా పని చేయను. కానీ.. ‘గాయపడ్డ సింహం’ సినిమాలో నేను చేసిన పాత్ర కమల్ హాసన్ కూడా ఇంత వరకూ చేయలేదు. ఆయన చేయలేరని కాదు. కానీ… ఆయనకు అలాంటి అవకాశం రాలేదు. కానీ నాకు వచ్చింది” అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జేడీ. ఆయన ఎంత క్లారిటీ ఇచ్చినా కమల్ తో పోల్చుకోవడం కాస్త ఇబ్బంది పడే అంశమే.
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రానికి కశ్యప్ దర్శకుడు. పవన్ సాధినేని నిర్మాతగా వ్యవహరించారు. మే1 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆంధ్ర, తెలంగాణలో ఈ సినిమాని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
