ద‌ళిత కార్డును టి. కాంగ్రెస్ వాడుతుందా..?

తెలంగాణ‌లో రాజ‌కీయాల్లో కొత్త పొత్తుల‌కు తెర లేచే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెరాస‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్ప‌టి నుంచే కాంగ్రెస్ సిద్ధ‌మౌతుంది. కేసీఆర్ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త పెరుగుతోందంటూ ఆ మ‌ధ్య ఓ స‌ర్వేను బ‌య‌ట‌పెట్టిందీ పార్టీ. గ‌డ‌చిన వారంలో… కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని కూడా ఇప్పుడే ప్ర‌క‌టించేయండీ అంటూ అధిష్టానంపై రాష్ట్ర నేత‌లు ఒత్తిడి పెంచిన సంగ‌తీ తెలిసిందే. దీంతోపాటు, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన నిధుల స‌మీక‌ర‌ణ‌పై కూడా టి.కాంగ్రెస్ ఇప్ప‌ట్నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేసింద‌నీ చెప్పుకుంటున్నారు! ఓవ‌రాల్ గా చెప్పాలంటే… టి. కాంగ్రెస్ లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంద‌నే అనాలి. ఇదే క్ర‌మంలో ద‌ళితుల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది!

‘దళిత’ కార్డు అనేది ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంత కీల‌కంగా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలపై వ‌ల్ల‌మాలిన అభిమానం పుట్టుకొచ్చేస్తుంది! తెలంగాణ‌కు ద‌ళిత అభ్య‌ర్థి ముఖ్య‌మంత్రి అవుతారంటూ అప్ప‌ట్లో కేసీఆర్ భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. ఆ త‌రువాత‌, రాష్ట్రం సిద్ధించాక ఆయ‌నే ముఖ్య‌మంత్రి అయ్యారు. ద‌ళిత సీఎం హామీ గురించి మాట్లాడ‌టం మానేశారు. ఈ హామీ విష‌య‌మై కేసీఆర్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే దిశ‌గా కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింద‌నే చెప్పాలి.

మాదిగ రిజ‌ర్వేష‌న్ల పోరాట స‌మితి అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ‌తో టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ద‌ళితులపై జ‌రిగిన దాడుల‌కు సంబంధించిన ఒక నివేదిక‌ను ఆయ‌న‌కు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌లకు సంబంధించిన అంశాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. దీంతో రాజ‌కీయంగా ఈ భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంటోంది. ఎందుకంటే, కేసీఆర్ వ్య‌తిరేకులంద‌రినీ క‌లుపుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు కాంగ్రెస్ కూడా సంకేతాలిస్తోంది. సో.. తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర లేచింద‌ని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.