సీనియర్ హీరోలంతా స్పీడు పెంచారు. చిరు, వెంకీ, నాగ్, బాలయ్య… అంతా కథలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నందమూరి బాలకృష్ణ అయితే మరీనూ. ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమా అంటూ ఆయన ఎప్పుడూ బిజీనే. ప్రస్తుతం ఆయన 111వ సినిమాపై ఫోకస్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈలోగా మరో కథని కూడా రెడీ చేసుకొని, రెండింటినీ సమాంతరంగా పూర్తి చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అందుకు తగిన కథల వేటలో ఉన్నారు.
ఈమధ్య వారానికి రెండు మూడు కథలు వినడమే పనిగా పెట్టుకొన్నారు. ఆమధ్య ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస రాజు బాలయ్యని కలిసి ఓ కథ చెప్పారు. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో మరో సినిమా పట్టాలెక్కాలి. అయితే వెంకీ సినిమా పూర్తయిన తరవాతే ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతారు అనిల్ రావిపూడి. మాస్, కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న హరీష్ శంకర్ సైతం బాలయ్యకు ఓ కథ వినిపించారు. అది బాలయ్యకు కూడా నచ్చిందని టాక్. అన్నీ కుదిరితే.. బాలయ్య చేసే 112వ సినిమా ఇదే కావొచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉంది. క్రిష్ ఇది వరకే బాలయ్యకు ఓ కథ చెప్పారు. ఆదిత్య 369కి అది సీక్వెల్. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిత్య 999 ని భుజాలపై వేసుకొనే దర్శకుడు కూడా బాలయ్యకు ఇప్పుడు అవసరం. అందుకోసం ఆయన వేట కొనసాగిస్తూనే ఉన్నారు.
