ఇలాంటి ఫ్యాన్స్ పవన్ కు అవసరమా ?

అభిమానులకు లాజిక్కులు వుండవు. ఎమోషన్స్ మాత్రమే. అయితే ఇప్పుడీ అభిమానుల ఎమోషన్సే హీరోల కొంప ముంచుతున్నాయి. అభిమానులు హీరోలకి వాళ్ళ సినిమాలకి ఎంత ప్లస్ అవుతారో తెలియదు కానీ.. వాళ్ళ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది కొందరి వెర్రి తలలు వేసే అభిమానం. ఈ కోవలో పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ ”అజ్ఞాతవాసి’ సినిమా చూసి ఓ కుర్రాడు తనకు సినిమా నచ్చలేదని పోస్టర్ పై చెప్పుతో కొట్టిన వీడియో ఒకటి హాల్ చల్ చేసింది. అయితే ఇప్పుడా కుర్రాడిని వెదికి పట్టుకొని చావబాదారు కొందరు. ”జై పవనిజం” అంటూ ఓ గ్రూప్ పాపం ఆ కుర్రాడిపై కనీస మానవత్వం లేకుండా దాడి చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. దీంతో సాదారణంగానే హద్దులు దాటుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ విమర్శల పర్వం మొదలైయింది. నిజంగా చాలా దురదృష్టకరైన సంఘటన ఇది.

ఇదే కాదు పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు మొదటి నుండి కాస్త హర్ష గానే వుంది. ”తమ దేవుడిని ఏమైనా అంటే ఊరుకునేది లే”దు ఆన్నట్టు సాగుతుంది వారి వ్యవహారం. పవన్ కళ్యాణ్ స్వయంగా ”నన్ను తిడతారు .విమర్శిస్తారు. అంత మాత్రానా మీరు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదని” చెప్పినా వీరి తీరు మారడం లేదు. చాలా నిరంకుశ ధోరణి కనిపిస్తుంటుంది.

ఐతే జై పవన్ కళ్యాణ్.. జై పవనిజం అంటున్న ఫ్యాన్స్ .. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ధోరణితో పవన్ కళ్యాణ్ జరిగే కీడే తప్పా మేలు లేదు. ఒకప్పటి పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు వేరు. అప్పుడు కేవలం హీరో. ఇప్పుడు ఆయన ప్రజా జీవితంలోకి వస్తున్నాడు. ఎన్నికల్లో పోటి చేయబోతున్నాడు. ఫ్యాన్స్ ఇదే ధోరణి కొనసాగిస్తే ”అధికారం లేకపోతేనే ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఫ్యాన్స్.. ఒకవేళ జనసేన కనుక రాజకీయ బలం పుంజుకుంటే ఇంక వీరి ఆగడాలకు అడ్డు అదుపు ఉంటుందా? అనే భావన అందరిలోనూ కలుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కు కచ్చితంగా నష్టం కలిగించే అంశమే.

ఎవరీ ఫ్యాన్స్ :

పవన్ కళ్యాణ్ పేరు చెబుతున్న వారందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. ఇందులో కొంతమంది వ్యతిరేక శక్తులు కూడా వున్నారు. వాళ్లే పవన్ కళ్యాణ్ కు నష్టం చేకూర్చే పనులు చేస్తూ ఇలాంటి పోస్టులు, వీడియోలు తయారు చేస్తున్నారనే వాదన కూడా వుంది. వుంటే వుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఒక క్లారిటీతో వుండాలి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే తీసుకోండి. ఆ వీడియో చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంత దుర్మార్ఘంగా వుంటారా ? అనే అందోళన కలిగించేలా వుందా వీడియో. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించేలావుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కానీ ఆయనకు అంత తీరిక లేకపోతె ఆయన టీమ్ నుండి ఎవరో ఒకరు ఇలాంటి చర్యలను ఖండిస్తే బావుంటుంది. ”ఆ వీడియోలో పవనిజం నినాదాలకు తమకు ఎలాంటి సంబధం లేదు. చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోండి. ఇకపై కూడా ఎవరైనా జై పవనిజం అంటు ఇలాంటి అమానుష చర్యలు పాల్పడితే మాకు సంభంధం లేదు” అని ఒక ప్రకటన చేయొచ్చు కానీ అలాంటిదేమీ జరగడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఖాతాలోనే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది.

ఇదెక్కడి అభిమానం?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా మూడ్ లో లేరు. ఆయన మనసంతా రాజకీయాలపై వుంది. రాజకీయ కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దం అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన బలం అభిమానులు. అయితే ఇలాంటి చర్యలు వల్ల అభిమానులే బలహీనతగా మారే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సినిమా అంటే ఓకే. ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ పాలిటిక్స్ అంటే మాటలు కాదు. చాలా ఓర్పు సహనం కావాలి. ఒక్కరు కాదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ విమర్శకుడే. వేసే ప్రతి అడుగుపై ఒక విమర్శ వుటుంది. దీనికి ప్రిపేర్ అయ్యే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇంక దీనికి ప్రిపేర్ కాలేదనిపిస్తుంది.”పవన్ ని విమర్శిస్తే మీ సంగతి తేలుస్తాం’ అన్న టైపులో వుంది వ్యవహారం. ఇదెక్కడి అభిమానమో అర్ధం కాదు. ఇలాంటి అభిమానులతో పవన్ కళ్యాణ్ ఎలా నెట్టుకువస్తారో ఆయనకే తెలియాలి.

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు .. ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా లేదని చెప్పాలి. నాలుడు దశాబ్దాలు గా వెండితెరను అలరించి అభిమానులు ముట కట్టుకున్నారు మెగాస్టార్. అన్ని వర్గాలు ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో చిరు. అంతేకాదు.. కొంతమంది హీరో ఫ్యాన్స్ కూడా చిరు వైపు మొగ్గు చూపారు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అది కనిపించడం లేదు. దీనికి కారణం.. పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యవహరిస్తున్న తీరనే చెప్పాలి. ఏ హీరో వేడుకకు వెళ్ళినా పవన్ కళ్యాణ్ అని అరుపులు. దీంతో ఆ హీరో ఫ్యాన్స్ ఇగోపై దెబ్బ కొట్టినట్లు అవుతుంది. వెరసి.. పవన్ కళ్యాణ్ అందరి హీరోల ఫ్యాన్స్ కి ఒక ప్రత్యర్ధిగానే మారుతున్నారు. చిరు విషయంలో మాత్రం ఇలాంటి ప్రతికూలత లేదు. ఆయన ”అందరి జీవి చిరంజీవి”గానే వున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కొందరు అభిమానులు కారణంగానే పాజిటివ్ వాతావరణంను కోల్పోవాల్సివస్తుంది. మరి మున్ముందు ఇలాంటి ఓవర్ ఎమోషనల్ ఫ్యాన్స్ ను పవన్ ఎలా కంట్రోల్ చేస్తారో కాలమే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.