ఎడిటర్స్ కామెంట్ : నవ్విపోదురుగాక..!?

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని.. బరి తెగిస్తే ఎవరు ఏం చేయగలరు..?. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పాలన ఇంతే ఉంది. రాజ్యాంగ వ్యవస్థ…ఇప్పటి వరకూ ఎవరూ నేరుగా ఎటాక్ చేయడానికి కూడా సాహసించని వ్యవస్థ అయిన న్యాయవ్యవస్థపైనే నిస్సిగ్గుగా దాడికి పాల్పడుతూ… ఎదురు దాడి చేస్తున్న వైనం ఆంధ్రలోనే కనిపిస్తోంది. ఏపీలో లాంటి పరిస్థితిని దేశంలో ఎక్కడా చూడలేని న్యాయమూర్తులే నివ్వెర పోయే పరిస్థితి ఏర్పడింది. కానీ దున్నపోతు మీద జడివాన కురిసినట్లుగా పరిస్థితి మారిపోయింది కానీ.. బాధ్యలైన వారు కానీ… ప్రత్యక్షంగా దానికి కారణమైన వారిలో కానీ.. కనీస మాత్రం చలనం ఉండటం లేదు.

ప్రైవేటు సైన్యంలా మారిన పోలీసుల్ని చూసి నవ్వుతున్నారు..!

“సీబీఐ అధికారులు ఆఫీస్ తెరవాల్సిన పరిస్థితి వస్తుంది”.. అని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారంటే… పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. పోలీసులు ప్రైవేటు సైన్యంలా మారి.. కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఇలాంటివి తరచూ తమ ముందుకు వస్తూండటంతో హైకోర్టు న్యాయమూర్తులు.. రెండు సార్లు సీబీఐ విచారణ చేయించారు. మూడు సార్లు జ్యూడీషియల్ విచారణ చేయించారు. జ్యూడిషియల్ విచారణలో పోలీసుదే తప్పని తేలింది. పోలీసులు .. రాజకీయ నేతలతో కుమ్మక్కయి.. ప్రైవేటు సైన్యం మాదిరిగా ప్రజలపై పడి వేధిస్తున్న విషయాన్ని హైకోర్టు పలుమార్లు గుర్తించింది. హెచ్చరించింది. డీజీపీని పిలిచించి రోజంతా నిలబెట్టించింది. కానీ మార్పు రాలేదు. మళ్లీ మళ్లీ అలాంటి కేసులు వస్తూనే ఉన్నాయి. డీజీపీకి ఏమీ అనిపించడం లేదు. సుదీర్ఘ కాలం సర్వీసులో ఉండి.. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న డీజీపీ నేతృత్వంలోని పోలీసు శాఖా ఇలా పని చేస్తోందని.. అన్న అనుమానం చాలా మందిలో వస్తుంది. కానీ డీజీపీ తొణకడం లేదు.. బెణకడం లేదు. హైకోర్టులు ఎలాంటి చీవాట్లు పెట్టినా ఆయన తుడిచేసుకుని.. చంద్రబాబుకు రాజకీయ లేఖలు రాయడానికి సమయం కేటాయిస్తున్నాయి. నవ్విపోదురుగాక అని.. పోలీస్ బాస్ నిరూపిస్తున్నారు.

న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిని చూసి నవ్విపోతున్నారు..!

న్యాయవ్యవస్థ అంటే.. ఎనలేని గౌరవం.. మన దేశంలో ఉంది. న్యాయమూర్తుల మీద చిన్న కామెంట్ చేయడానికి కూడా ఇప్పటి వరకూ ఎవరూ సాహసించలేదు. గతంలో రాజకీయ పార్టీలు తీర్పులపై విమర్శలు చేసినా అది చాలా పరిమితం.. ఓ గీత దాటి బయటకు వచ్చేవి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జడ్జిలను నరికేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ప్రతీ ఒక్క న్యాయమూర్తికి చౌదరి అనే ట్యాగ్ తగలించేస్తున్నారు. బండబూతులు తిడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలా చేసిన వారికి ప్రభుత్వం వైపు నుంచి ప్రమోషన్లు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీదిరి అప్పలరాజుకు ఏ కోటాలో మంత్రి పదవి వచ్చిందో చాలా మందికి అర్థం కాలేదు.. కానీ ఆయన న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిఫలమేనని రాజకీయవర్గాలందరికీ తెలుసు. కానీ.. అలా న్యాయవ్యవస్థను కించ పరిచిన వారిపై.. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి.. అనుకూల తీర్పులు వచ్చే వరకూ దారుణంగా వెంటాడే వ్యూహాన్ని అవలంభించింది మాత్రం.. అధికార పార్టీ నేతలు. అయితే దీనికి సహకరించింది మాత్రం సీబీసీఐడీ. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ.. ఎవరైనా పోస్టులు పెడితే.. పోలీసులు అర్థరాత్రి పూట ఇంటికెళ్లిపోయేవారు. అదుపులోకి తీసుకునేవారు… ఇది ఎక్కువగా అనధికారికంగానే ఉంటుంది. కానీ అదే పరిస్థితి హైకోర్టు.. హైకోర్టు న్యాయమూర్తులకు వస్తే.. పట్టించుకున్న నాధుడు లేరు. సీబీసీఐడీ కాదు కదా… అందులో ఉన్న కానిస్టేబుల్ కూడా.. కనీసం ఆ పోస్టులను తీసివేయించాలన్న ఆలోచన కూడా చేయలేదు. మా ఫిర్యాదుకే స్పందన లేదా.. అని హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. అయినా సరే నవ్విపోదురుగాక అనుకుంటూంటే.. ఎవరేం చేయగలరు..!?

సీఎం అవినీతిని సహించని వైనాన్ని జయరాం విషయంలో చూసి నవ్వుతున్నారు..!

పోలీసులు, సీబీసీఐడీ తీరుపై పోలీసుల హెచ్చరికలు .. విన్న తర్వాత.. ఏ ప్రభుత్వం అయినా నైతిక బాధ్యత తీసుకుంటుందని.. కానీ అసలు బాధ్యతకే దిక్కు లేదు ఇక నైతిక బాధ్యతలా అని జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి గుమ్మనూరు జయరాం పదవి చేపట్టిన ఏడాదిన్నరలోనే ప్రజల్ని నిలువదోపిడీ చేసేశారు. ఆయన బాగోతాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా బయటపడుతున్నాయి. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు కానీ.. అసలు లంచాలు అందింది మాత్రం ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాంకే. నిందితుడి నుంచి తీసుకున్న కారుతో వారు చేసిన షో చూసిన ఎవరికైనా ఇది అర్థం అవుతుంది. ఆ కారు బహిరంగంగా ఉంది కాబట్టి తెలిసింది.. కానీ గుట్టుగా అందుకున్నదెంతో లెక్క తేలాల్సి ఉంది. ఆయన తన కుటుంబసభ్యుల పేర్లతో వందల ఎకరాలు కొన్న గుట్టు కూడా బయటపడింది. దాని కోసం ఆయన రూ. కోటిన్నర క్యాష్ రూపంలో కట్టినట్లుగా డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇక బ్లాక్ ఎంత కట్టి ఉంటారో అంచనా వేయడం కష్టం. అవన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక సొంత గ్రామంలో పేకాట క్లబ్ పెట్టి చేసిన యవ్వారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. కళ్ల ముందు ఆ మంత్రి లీలలు అన్నీ కనిపిస్తున్నా.. నీతి ప్రవచనాలు వల్లించే ముఖ్యమంత్రి.. ఇంకా అదే పని చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసిందా అని ఇంకా వెదుకుతూనే ఉన్నారు తప్పులు చేయకపోయినా.. తప్పుల్లా భావించి… ఎవర్నో ఒకర్ని అరెస్ట్ చేద్దామనే తాపత్రాయ పడుతున్నారు… జనం నవ్విపోదురు గాక అనుకుంటున్నా అదే పరిస్థితి..!

అప్పులు చేస్తున్న వైనం చూసి పగలబడి నవ్వుతున్నారు..!

ప్రభుత్వ పాలన అంటే అప్పులు చేసో.. ఆస్తులు తెగనమ్మి పంచి పెట్టడమా అని.. నోసలు చిట్లింటే పరిస్థితి ఇప్పుడు బయట నుంచి ఏపీని చూసే వారికి వచ్చింది. ఓ పరిశ్రమ లేదు.. ఓ ఉపాధి ప్రయత్నం లేదు.. సంపద సృష్టించే ఆలోచనల్లేవు. భవిష్యత్‌ను బంగారు మయం చేసే ప్రాజెక్టుల ఊసే లేదు. అమరావతి లాంటి ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని చావగొట్టి చెవులు మూసేశారు. ఇక ఆదాయం ఎక్కడిది. ఆదాయం పావలా అయితే… ఖర్చు పెట్టేది రూపాయి.. అప్పు తెచ్చేది రెండు రూపాయలు. మిగతా రూపాయి ఎక్కడికి వెళ్తుందో చెప్పలేని దుస్థితి. ఏడాదిలో యాభై వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్‌లో పెట్టారు. ఆ పరిమితి ఐదు నెలల్లో ముగిసింది. ఈ పద్దతిన.. ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు అవుతుంది. రెండేళ్లలో కొత్త ప్రభుత్వం చేసిందే రెండున్నర లక్షల కోట్ల అప్పు అవుతుంది. అదంతా ప్రజలపై పడే భారమే. దీనికి తోడు మళ్లీ రోడ్ల రిపేర్లు కావాలంటే పన్నులు. ప్రజలకు ఏ పని చేయాలన్నా .. దానిపై పన్ను వసూలు చేస్తే తప్ప చేయలేని పరిస్థితి. అప్పులు తెచ్చేది సరిపోవడం లేదన్నమాట. ఇలాంటి ఆర్థిక నిర్వహణ ఇంకెక్కడా ఉండదు.. కానీ ఎవరు నవ్వితే ప్రభుత్వానికేంటి..?

నవ్విపోదురుగాక… సిగ్గుపడేదెవ్వరు..!?

దళితులపై దాడుల దగ్గర్నుంచి సీఎంఆర్ఎఫ్ ఫండ్‌ను చిలక్కొట్టుడు కొట్టడం వరకూ.. వైసీపీ నేతలు ఎవరూ తగ్గడం లేదు. ప్రభుత్వం మాదే కాబట్టి.. ఏం చేసినా చెల్లుతుందన్నట్లుగా వారున్నారు. కాకపోతే ఓ ఎమ్మెల్యే ఫేక్ చెక్కులతో రూ. 117 కోట్ల ప్రజాధనం కొట్టేయాలనుకోవడం ఏమిటి..? ఈ వైపరీత్యం ఇంకెక్కడైనా ఉంటుందా..?. అందుకే ఏపీలో పాలన అంతా నవ్వులాట అయిపోయింది. అయితే.. అక్కడ నవ్వే వాడితే తప్పు. నవ్విపోయేలా చేసేవాళ్లది కాదు. అది అక్కడి రూల్.. అంతే. .. కాదూ కూడదంటే కేసులకు రెడీగా ఉండాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close