ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

“టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు..” కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది. వారు మత్రమే వారికి అవసరమైన వారి జీవితాల్లోకి తొంగి చూసి రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిలింగ్ చేసి తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజంగా బయటకు తెలుస్తున్నవి కొంతే ఉండవచ్చు. బయటకు రాని సంచలనాత్మక విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో సందేహం లేదు. రాజకీయ స్వార్థ పరుల చేతుల్లోకి ట్యాపింగ్ అస్త్రం వెళ్లిన తర్వాత అందరూ బ్లాక్ మెయిలింగ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. మరి నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఈ ట్యాపింగ్ చేసి దొరికిపోయిందా అంటే అందరూ భుజాలు తడుముకోవాల్సిందే. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. కానీ దొరికిపోయేవారు కొందరే. దొరికినా ఏం పీకలేరు అని ఎదురుదాడికి దిగేవారు మరికొందు.

ట్యాపింగ్ చేసి అప్పట్లో సీఎం రాజీనామా – ఇప్పుడు చేస్తే తప్పేమిటంటున్న నేతలు

మన దేశ రాజకీయ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ అంశం కొత్తదేం కాదు. ఇందిరాగాంధీ పాలనలో ప్రతిపక్ష నేతల ఫోన్ సంభాషణలు ఇంటెలిజెన్స్ వర్గాలు ట్యాప్ చేశాయనే ఆరోపణలున్నాయి. 1988లో కర్ణాటకలోని రామకృష్ణ హెగ్డే జనతా పార్టీ ప్రభుత్వం ఈ అంశం కారణంగానే పతనమైంది. ట్యాపింగ్ చేసినందుకు నైతిక బాధ్యతగా రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేసారు. పార్టీలోని అసంతృప్తుల, ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడానికి అనుమతిస్తూ ఆయన సంతకాలు చేసిన ఆదేశ పత్రాలను కేంద్రం చట్టసభల ముందుంచింది. ప్రధాని రాజీవ్ సూచనల మేరకు రాష్ట్రపతి భవన్‌లోని పలు గదులను బగ్గింగ్ చేశారని 1986లో అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ ఆరోపించారు. రెండు దఫాల యూపీఏ పాలనలో ప్రతిపక్ష నేతలవే కాకుండా, మిత్రపక్షాల నేతల ఫోన్లను సైతం కాంగ్రెస్ సర్కారు ట్యాప్ చేసిందని అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. శరద్‌పవార్, మమతాబెనర్జీ, యశ్వంత్‌సిన్హా, ప్రకాశ్‌కారత్, నితీష్‌కుమార్ వంటి ప్రత్యర్థుల పైనే కాకుండా దిగ్విజయ్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, ఏ కే ఆంటోని వంటి స్వపక్ష మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వివాదం చెలరేగింది. నెలకు 9వేల ఫోన్లు, 500 ఈ-మెయిళ్ల చొప్పున యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందని 2018లో ఒక ఆర్టీఐ సమాచారం వెల్లడించింది. అంటే ట్యాపింగ్, హ్యాకింగ్ చేసినందుకు ఓ ప్రభుత్వం కుప్పకూలిపోయిన స్థితి నుంచి అధికారంలో ఉన్న వారికి అదో ఆయుధం అన్నట్లుగా మారిపోయింది. అందుకే కేటీఆర్ ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు.. తప్పేంటని సమర్థించుకుంటున్నారు. ఆయన అన్నట్లుగా తెలంగాణలో ఒకరిద్దరు ఫోన్లు కాదని.. ఓ మాఫియా స్థాయిలో ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

పదేళ్లుగా తెలంగాణలో ట్యాపింగ్ పై అందరికీ అనుమానమే

ఉమ్మడి రాష్ట్ర సీఎంగా హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తున్న చంద్రబాబు వాయిస్ రికార్డు చేసి.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని పట్టుకున్నారు. అప్పట్నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం.. తెలంగాణలో నలుగుతూనే ఉంది. అది రాను రాను పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలక నిర్ణయాలు బీఆర్ఎస్ పెద్దలకు ముందుగానే తెలిసేవి. మోదీ రైతు చట్టాలను ఓ ఉదయం హఠాత్తుగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలా చేస్తారని దేశం ఊహించలేదు. కానీ అంతకు ముందు రైతు చట్టాలకు మద్దతుగా మాట్లాడిన కేసీఆర్ మోదీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రైతుల చట్టాలపై వ్యతిరేక గళం వినిపించారు. చట్టాలు రద్దు చేయాలని ధర్నా చేశారు. రైతులను పరామర్శించారు. గత్తర పుట్టిస్తామని కూడా ప్రకటించి వచ్చారు. తర్వాత మోదీ చట్టాలను రద్దు చేశారు. ఎవరికీ తెలియనిది కేసీఆర్‌కు భలే తెలిసిందే అనుకున్నారు. అదొక్కటే కాదు.. చాలా విషయాల్లో బీఆర్ఎస్ పెద్దలకు సమాచారం చేరిపోయింది. అంతే కాదు.. గవర్నర్ తమిళిసై కూడా ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. తన ఫోన్‌కు తుషార్ అనే వ్యక్తి నుంచి మెసెజ్ రాగానే ఫామ్ హౌస్ కేసులో ఉన్న తుషార్ అని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారని.. తన ఫోన్‌లోకి వచ్చిన మెసెజ్ గురించి టీఆర్ఎస్ నేతలకు ఎలా తెలిసిందని గవర్నర్ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ నిజమేనని ప్రస్తుత ట్యాపింగ్ విచారణలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కాకుండా.. వ్యాపారవేత్తల లావాదేవీలను తెలుసుకుని అందులో లొసుగుల్ని కనిపెట్టి.. నిర్బంధించి ఆస్తులు, డబ్బులు లాక్కున్న ఘటనలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అంటే మాఫియా స్థాయికి చేరినట్లే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విపక్షాలకు చెందిన డబ్బులు మాత్రం విచ్చలవిడిగా తెలంగాణలో పట్టుబడేవి. వారికి నిధులు అందకుండా చేసేవారు. ఇదంతా ట్యాపింగ్ మహత్యమే.

మోదీ సర్కార్ పెగాసస్ వినియోగం బహిరంగ రహస్యం – కానీ దొరకలేదంతే !

పెగాసస్‌ స్పైవేర్‌ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఉపయోగించిందని న్యూయార్క్ టైమ్స్ 2021లో ప్రకటించినప్పుడు దేశంలో గగ్గోలు రేగింది. ఏడాది పాటు సాగించిన పరిశోధన తర్వతా న్యూయార్క్ టైమ్స్ ‘ద బాటిల్‌ ఫర్‌ ద వరల్డ్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సైబర్‌వెపన్‌’ పేరుతో కథనం రాసింది. ఈ స్పైవేర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉపయోగిస్తున్నారో ఆ పత్రికా కథనం వివరించింది. మెక్సికో ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ స్పైవేర్‌ను ఉపయోగిస్తోంది. మహిళా హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు సౌదీ అరేబియా ప్రయోగిస్తోంది. ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రిత్వశాఖతో కుదిరిన ఒప్పందాల మేరకు పోలండ్‌, హంగరీ, భారత్‌, ఇతర దేశాలకు పెగాసస్‌ను అందచేశారని తెలిపింది. అమెరికా ఎఫ్‌బిఐ కూడా దీన్ని కొనుగోలు చేసి పరీక్షించింది. ఆ సమయంలో మన దేశంలోని కొన్ని మీడియా సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు చేసి.. పెగాసస్ వినియోగాన్ని బయట పెట్టాయి. రాహుల్‌ గాంధీతో సహా పలువురు రాజకీయ నేతలు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, పలువురు మీడియా సిబ్బందిపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అవన్నీ నిరాధారమని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. పెగాసస్‌ వ్యవహారంపై ” ది వైర్‌ ” వెబ్ సైట్ వరుసగా కథనాలు ప్రచురించింది. దానిపై పార్లమెంట్‌లో పెద్దయెత్తున దుమారం రేగింది. ఈ విషయంపై దర్యాప్తుకు ముగ్గురు స్వతంత్ర నిపుణులతో సుప్రీం కోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి భయపడి అనేక మంది నిపుణులు ఈ కమిటీలో ఉండేదుకు కూడా ఆసక్తి చూపలేదు. చివరికి పెగాసస్ ఆనవాళ్లు లేవని తేల్చారు. కానీ అది వైఫైలా చుట్టూనే అందరికీ తెలుసు. పెగాసస్‌తో పాటు టెక్ ఫాగ్ అనే మరో యాప్‌తోనూ నిరూపితమైంది. ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులందరిపైనా కేంద్రం నిఘా ఉందని గట్టి నమ్మకం కానీ ఎవరూ నిరూపించలేరు. అందుకే ఆరోపణలు తప్ప ఏమీ చేయలేరు. ఇటీవల ఐ ఫోన్ ను ట్యాప్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా ఎన్నికల ముందు కీలక రాజకీయ నేతలందరి ఫోన్లకు హెచ్చరికలు వచ్చాయి. మరోసారి దుమారం రేగింది. నిజానికి మోదీ గుజరాత్ ప్రధానిగా ఉన్నప్పుడే్ ట్యాపింగ్ ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించారు. నరేంద్ర మోడీ తన ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా సహకారంతో ఫోన్‌ట్యాపింగ్‌ను చట్టబద్దం చేసే వికృత ప్రక్రియకు 2003లోనే శ్రీకారం చుట్టారు. ఆ బిల్లును అప్పటి ప్రధాని వాజ్‌పెయి నిర్దద్వందంగా తిరస్కరిస్తూ, మళ్లీ గుజరాత్‌ అసెంబ్లీకి తిప్పిపంపారు.2008లో ప్రతిభాపాటిల్‌, 2015లో ప్రణబ్‌ముఖర్జీలూ వెనక్కి పంపారు.

అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ఆరోపణలు

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏపీలో ఉండేవారు కాదు. హైదరాబాద్‌లో ఉండేవారు. ఎందుకంటే తన ఫోన్లు ట్యాప్ చేస్తారని ఆయన ఏపీలో ఉండరని చెబుతారు. జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం లో ఉన్న ఇంటలిజెన్స్ చీఫ్ ను టార్గెట్ చేసుకున్నారు. అయితే ట్యాపింగ్ జరిగిందని నిరూపించలేకపోయారు. పరికరాలు కొన్నారని కూడా నిరూపించలేకపోయారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో పెగాసస్ పై కమిటీ వేశారు కనీ.. చివరికి డేటా చోరీ అని కవర్ చేశారు కానీ.. ట్యాపింగ్ ను నిరూపించేలకపోయారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై ట్యాపింగ్ పేరుతో వస్తున్న ఆరోపణలు లెక్కలేనన్ని ఉన్నాయి. సొంత ఎమ్మెల్యేలపై ట్యాపింగ్ చేస్తున్నరని వైసీపీలో ఉన్నప్పుడు కోటంరెడ్డి కొన్ని సాక్ష్యాలు బయట పెట్టారు. ఇటీవల టీడీపీ అభ్యర్థుల సమావేశంలో చొరబడిన ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఫోన్ లో కేశినేని చిన్ని ఫోన్ లో ఉండాల్సిన వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తున్నారని.. నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారని గతంలో పయ్యావుల కేశవ్ కొన్ని వివరాలు బయట పెట్టారు. ఇది ఒక్క ఏపీలోనే కాదు.. కర్ణాటక, తమినాడు అనే తేడా లేకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. విచ్చలవిడిగా అవినీతి సొమ్ముతో ఎంత ఖర్చు పెట్టి అయినా ప్రత్యర్థుల జీవితాల్లోకి తొంగి చూసి వారిని రాజకీయంగా దెబ్బకొట్టాలని అనుకుంటున్నారు. చివరికి అది .. వ్యాపారస్తుల్ని, హిరోయీన్లను బెదిరించే మాఫియాగా కూడా మారడం.. అసలు విషాదం.

వ్యక్తిత్వాలను మంటగలిపి, కుటుంబాలను రోడ్డుకిడ్చే పనులుచేసే రాజకీయ నేతలు, పోలీసు అధికారులను న్యాయస్థానాల బోనులో నిలబెట్టాల్సిందే. అక్రమార్కుల సొమ్ముతో హవాలా రాజ్యాలను నడిపే హక్కు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి లేదు. ఇది ఎక్కడి వరకు చేరుతుందో తెలియదు కానీ.. ఈ పనులు చేస్తున్న ప్రతి ప్రభుత్వం ప్రజా ద్రోహానికి పాల్పడుతున్నట్లే. కానీ చేస్తే తప్పేంటి అనే పరిస్థితికి రాజకీయ నేతలు వచ్చారంటే.. ఇక ప్రజల వ్యక్తిగత స్వేచ్చకు ఎవరు జవాబుదారి ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close