విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సరికొత్త విమానయాన సంస్థ ఫ్లై 91 తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను ప్రారంభించగా, తొలి విడతగా విజయవాడ – హైదరాబాద్ నగరాల మధ్య ఈ విమానాలు నడవనున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు ప్రారంభమైనా కొనసాగలేకపోయాయి. ఇప్పుడీ సంస్థ నిలదొక్కుకునేందుకు గట్టి ప్రణాళికతో ముందుకు వచ్చింది.
ఈ ఎయిర్‌లైన్‌ను గోవా కేంద్రంగా పనిచేసే ‘జస్ట్ ఉడో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. కొంకణి భాషలో ఉడో అంటే ఎగరడం అని అర్థం. భారత దేశ కంట్రీ కోడ్ +91 ని ప్రతిబింబించేలా ఈ సంస్థకు ‘ఫ్లై 91’ అని నామకరణం చేశారు. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ( లో భాగంగా చిన్న పట్టణాలను మెట్రో నగరాలతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ రంగంలోకి దిగింది.
దీని వెనుక ఉన్న ప్రమోటర్లు ఏవియేషన్ రంగంలో తలపండిన నిపుణులు . కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన మనోజ్ చాకో ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు ప్రముఖ ఇన్వెస్టర్, కన్వర్జెంట్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు హర్ష రాఘవన్ ఈ సంస్థలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్నారు. సుమారు రూ. 200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ సంస్థను వారు స్థాపించారు.
ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్ ATR 72-600 రకానికి చెందిన విమానాలను ఉపయోగిస్తోంది. ఇవి తక్కువ దూర ప్రయాణాలకు అత్యంత అనువైనవి. ఏ రాజకీయ నేపథ్యం లేకుండా, కేవలం వృత్తిపరమైన అనుభవం ఉన్న నిపుణులు నడుపుతున్న ఈ సంస్థ, సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లో తన విస్తరణను ప్రారంభించింది.


