ఈ రోజుల్లో చిన్న సినిమాల్ని మార్కెట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతోంది. ముఖ్యంగా ఓటీటీలకు అమ్ముకోవడం కత్తిమీద సామైపోయింది. కాకపోతే మార్కెట్ స్ట్రాటజీ కొత్తగా ఉంటే, టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టినీ ఆకర్షించగలిగితే ఓటీటీ డీల్ కుదుర్చుకోవడం కొంచెం సులభమే. ‘గాయపడ్డ సింహం’ అదే నిరూపించింది.
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా ఇది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. మొన్నామధ్య కాన్సెప్ట్ సాంగ్ విడుదల చేశారు. ఈరెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. నాన్ థియేట్రికల్ నుంచి ఈ సినిమాకు దాదాపు రూ.9 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు రూ.6 కోట్లు వచ్చాయట. అంటే మొత్తంగా రూ.15 కోట్లు.
ఈ సినిమాకు రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యింది. అంటే మూడుకోట్ల టేబుల్ ప్రాఫిట్. బిజినెస్ కట్ చూసి, ఈ సినిమాను కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకొచ్చాయి. అవుట్ పుట్ పై చిత్రబృందం నమ్మకంతో ఉంది. తరుణ్ భాస్కర్ ఇటీవల హీరోగా నటించింది ‘ఓం శాంతి శాంతి శాంతి’ పెద్దగా ఆడలేదు. కాకపోతే తరుణ్ కి మంచి పేరొచ్చింది ఈ సినిమా తరవాత తరుణ్ పూర్తిగా దర్శకత్వంపై దృష్టి పెట్టాలనుకొంటున్నారు. ఆయన దర్శకత్వంలో ‘ఈనగరానికి ఏమైంది 2’ రూపొందుతోంది. దానిపై ఆయన ఇప్పుడు దృష్టి పెట్టనున్నారు. ఈలోగా నటుడిగానూ ఓ హిట్ కోరుకొంటున్నారు. అది ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.
