గోపీచంద్ నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారాయన. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. రీతూ వర్మ కథానాయిక. ఈ చిత్రానికి ‘భరత వర్ష’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈరోజు గ్లింప్స్ విడుదల చేశారు. గుర్రాలూ, కత్తి యుద్ధాలతో టీజర్‌ని రోమాంఛితంగా కట్ చేశారు. గోపీచంద్ ది యాక్షన్ ఇమేజ్. దానికి తగ్గట్టుగా కథ, కథనాలు సిద్దమయ్యాయన్న సంగతి గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. 642 AD నేపథ్యానికి చెందిన కథ ఇది. యుద్ధ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. అనుదీప్ దేవ్ ఇచ్చిన నేపథ్య సంగీతం, సౌందర రాజన్ కెమెరా పనితనం.. ఈ గ్లింప్సకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి వైవిధ్యభరితమైన చిత్రాల్ని అందించాడు సంకల్ప్ రెడ్డి. ఇంత పెద్ద సెటప్ ఉన్న కథని డీల్ చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. పాన్ ఇండియా రిలీజ్ కు కావాల్సినంత సెటప్ ఈ కథలో ఉంది. టైటిల్ కూడా అందరికీ రీచ్ అయ్యేదే. అటు గోపీచంద్ కీ, ఇటు సంకల్ప్ రెడ్డికీ ఈ సినిమా చాలా కీలకం. అందుకే అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అందుకు తగిన ఫలితం రావాలి మరి.


