కేంద్ర చెప్ప‌లేని ప్ర‌శ్న‌ల‌కు వెంక‌య్య జ‌వాబులు..!

కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ నోరు విప్ప‌లేని ప్ర‌శ్న‌లు రెండు ఉన్నాయి. ఒక‌టీ.. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ఎంత న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీశారో వారికే అంత‌కు చిక్క‌డం లేదు..! రెండోది… జీఎస్టీ వ‌చ్చాక దీర్ఘ‌కాలిక ప్రయోజ‌నాలు అద్భుత‌మ‌ని చెబుతున్నారే త‌ప్ప‌, తాత్కాలిక న‌ష్టాలకు నివార‌ణ ఏంట‌నేది కూడా చెప్ప‌లేక‌పోతున్నారు. ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కూ స‌మాధానం చెప్పాలంటే… అది ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడుకే చెల్లింది! రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌విలో ఉంటూ క్రియాశీల రాజ‌కీయాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. కానీ, ఆయ‌నలోని భాజ‌పా మ‌న‌సు అప్పుడ‌ప్పుడూ తొంగి చూస్తూనే ఉంటుంది. సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో పాల్గొన్న వెంక‌య్య నాయుడు మాట్లాడారు.

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌జలంద‌రూ రావ‌డం వ‌ల్ల‌నే ఈరోజున వ‌డ్డీరేట్లు త‌గ్గాయ‌న్నారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఒక సాహసోపేతమైన నిర్ణ‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి తీసుకున్నార‌న్నారు! న‌ల్ల‌ధ‌నాన్ని బ్యాంకుల్లోకి తీసుకుని రావ‌డ‌మంటే అంత సులువైన ప‌ని కాద‌న్నారు. బాత్ రూముల్లో, త‌ల‌గ‌డాల కింద, ఇంటి పైక‌ప్పుల్లో మ‌గ్గిపోయిన డ‌బ్బంతా ఈ ఒక్క నిర్ణ‌యంతో బ్యాంకుల్లోకి వ‌చ్చేసింద‌న్నారు. దాని కార‌ణంగానే ఇవాళ్ల బ్యాంకుల వ‌డ్డీ రేట్లు త‌గ్గాయ‌న్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల క‌లిగిన గొప్ప ప్ర‌యోజ‌నం ఇదే అన్నారు. అయితే, న‌ల్ల‌ధ‌నం గురించి మాట్లాడుతూ… ఇది రిజ‌ర్వ్ బ్యాంకు తేల్చాల్సిన లెక్క అని వెంక‌య్య దాటేశారు! జీఎస్టీ కూడా విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు నాంది ప‌లికిన నిర్ణ‌యం అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. జీఎస్టీ, నోట్ల ర‌ద్దు వ‌ల్ల తాత్కాలికంగా చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు కొన్ని వ‌చ్చాయ‌నీ, కానీ దీర్ఘ‌కాలంలో ఇవి చాలా ప్ర‌యోజ‌నాలుంటాయ‌న్నారు. ఆ ఇబ్బందుల ద‌శ ఇప్పుడు దాటేశామ‌న్నారు. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీని రాసిపెట్టుకోమ‌న్నారు. వ‌చ్చే ఏడాది ఇదే తేదీ నాటికి దేశ ఆర్థిక పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ ప్ర‌సంగం వినగానే ఎవ‌రికైనా ఏమ‌నిపిస్తుంది..? ఒక్క నిర్ణ‌యంతో బ్యాంకుల్లోకి న‌ల్ల‌ధ‌నం వ‌చ్చిప‌డింద‌ని అంటున్నారే.. కానీ, నీవ‌ర్ మోడీ లాంటి వాళ్లపై చర్యలకు అలాంటి ఒక్క నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదనిపిస్తుంది. న‌ల్ల‌ద‌నం వెలికి తీసి బ్యాంకుల్లోకి తెచ్చామ‌ని ఎవ‌రైనా గొప్పగా చెబుతుంటే… మ‌రి, బ్యాంకుల్లోని వేల కోట్ల‌ సొమ్మును దోచుకుపోయిన నీర‌వ్ లు, మాల్యాలు వంటివారి సంగ‌తేంటి..? న‌ల్ల‌ధ‌నంపై పోరాటాలు, అవినీతిపై ఉక్కుపాదాలు అని చెబుతుంటే.. మ‌రి, అలాంటివారు ఏ పాదం కిందా ఎందుకు ప‌డ‌టం లేద‌న్న ప్ర‌శ్న అత్యంత స‌హ‌జంగా సామాన్యుడికి క‌లుగుతుంది క‌దా! ఏదైతేనేం, పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి మోడీ స‌ర్కారు చెప్ప‌లేక‌పోయిన వాటికి జ‌వాబులు వెంక‌య్య నాయుడు చెప్పారని అనుకోవ‌చ్చు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.