గుజరాత్ ఫలితాల త‌రువాత‌ మోడీ అప్ర‌మ‌త్త‌త‌..!

ఎక్క‌డైనా గెలుపు గెలుపే! ఇంకా దాన్లో నైతిక విజ‌యం, వాస్త‌వ విజ‌యం.. ఇన్ని ర‌కాలు ఉండ‌వు. గుజ‌రాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, భాజ‌పా గెలిచింది. ఓట్ల శాతాలూ వాటాలు ప‌క్క‌నపెడితే అంతిమంగా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ఇదే.

అయితే, భాజ‌పా గెలిచినా.. నైతిక విజ‌యం త‌మ‌దే అంటూ కాంగ్రెస్ నేత‌లు ఉత్సాహంగా ఉన్నారు. సొంత రాష్ట్రంలో మోడీ నైతికంగా ఓడిపోయార‌నీ, ఇక కాషాయం ధ‌రించి ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్లిపోవాలంటూ ద‌ళిత నేత జిగ్నేష్ వంటివారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీది నైతిక విజ‌య‌మంటూ పార్ల‌మెంటులో కూడా ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఏదేమైనా, రాజ‌కీయాల్లో గెలుపు గెలుపే. నైతిక విజేత‌ల‌మ‌ని చెప్పునేవారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేరు క‌దా!

స‌రే, ఈ చ‌ర్చ ఇంత తీవ్రంగా జ‌రుగుతుంటే… దీనిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్పంద‌న మ‌రోలా ఉంది! ఫ‌లితాల నేప‌థ్యంలో ఎవ‌రు ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా ప‌ట్టించుకోవ‌ద్ద‌నీ, పార్టీ ప‌టిష్ట‌త‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెర‌గాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఈ విజయాన్ని గ‌ర్వంతో కాకుండా, బాధ్య‌త‌తో స్వీక‌రించాల‌ని పార్టీ శ్రేణుల‌కు చెప్పారు. అంతేకాదు… ఇదే స‌మ‌యంలో గుజ‌రాత్ ఫ‌లితాల‌పై లోతైన అధ్యయనం చేయాలంటూ ప్ర‌ధాని ఆదేశించ‌డం విశేషం! ఎలాగైతేనేం, మ‌రోసారి గుజరాత్ లో గెలిచారు క‌దా… అయినా ఈ ప‌రిశోధ‌న‌లు ఎందుక‌నేగా సందేహం? ఆ మాట వాస్త‌వ‌మే కావొచ్చు. కానీ గుజ‌రాత్ లో ఇది భాజ‌పా ఆశించిన స్థాయి గెలుపు కాదు! మోడీ, అమిత్ షా ఆశించిన మేజిక్ ఫిగ‌ర్ రాలేదు అనేది కూడా వాస్త‌వ‌మే.

ఈ ఫ‌లితాల‌పై చాలామంది విశ్లేష‌కులు చెప్పింది ఏంటంటే.. గుజ‌రాత్ లోని గ్రామీణ ప్ర‌జ‌లు మోడీ స‌ర్కారును తీవ్రంగా వ్య‌తిరేకించారు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల నుంచి కూడా వ్య‌తిరేక సెగ త‌గిలిందని. గుజ‌రాత్ లో మాత్ర‌మే కాదు.. దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల‌ గ్రామీణంలో భాజ‌పాపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంద‌నే అభిప్రాయాన్ని నీతీ ఆయోగ్ కి చెందిన కొంద‌రు ప్ర‌ముఖులూ అధ్య‌య‌నం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ వివ‌రాల‌న్నీ ప్ర‌ధానికి చేరిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఆయ‌న గుజ‌రాత్ ఫ‌లితాల‌పై లోతైన అధ్య‌య‌నం చేయాల‌ని సూచించిన‌ట్టు చెప్పుకోవ‌చ్చు. పెద్ద నోట్ల ర‌ద్దు మొద‌లుకొని నిన్న‌మొన్న‌టి బ్యాంకింగ్ డ్రాఫ్ట్ బిల్లు వ‌ర‌కూ సామాన్యుల్లో కొంత ఆందోళ‌న క‌నిపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. సో.. ఇలాంటి అంశాల‌పై ఇప్ప‌ట్నుంచే ఒక అధ్య‌య‌నం చేసుకుంటే, 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌లోపు కొన్ని దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టొచ్చు అనేది మోడీ వ్యూహంగా క‌నిపిస్తోంది. అంతిమంగా భాజ‌పా వ్య‌వ‌హార శైలిలో కొంత మార్పున‌కు గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు దోహ‌ద‌ప‌డ్డాయ‌నే చెప్పొచ్చు. ఇకపై సంస్కరణ పేరుతో దూకుడు నిర్ణయాలు తగ్గించుకుంటారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.