డ్ర‌గ్స్ కేసులో క‌ద‌లిక నివేదిక‌ల‌కే ప‌రిమిత‌మా..?

ఐదు నెల‌ల కింద‌ట వెలుగుచూసిన డ్ర‌గ్స్ కేసు సంచ‌ల‌నం రేకెత్తించింది. పదిమంది సినీ ప్ర‌ముఖుల్ని హుటాహుటిన విచార‌ణ పేరుతో సిట్ ముందుకు పిలిచారు. కొన్నాళ్ల‌పాటు ప్ర‌తీరోజూ ఇదే హ‌డావుడి! వివ‌రాలు సేక‌రించామ‌నీ, అనంత‌రం మ‌రో జాబితా వెలుగులోకి తెస్తామ‌నీ, చ‌ర్య‌లు తీవ్రంగా కఠినంగా ఉంటాయ‌నీ… ఇలా బాగానే హీటెక్కించారు. అది తాటాకు మంట అని తేలడానికి అట్టే స‌మ‌యం పట్ట‌లేదు. రెండో జాబితా బ‌య‌ట‌కి రాలేదు! కానీ, అప్ప‌టి విచార‌ణ స‌మ‌యంలో కొంత‌మంది నుంచి గోళ్లు, వెంట్రుక‌లు, ర‌క్త న‌మూనాల‌ను అధికారులు సేక‌రించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. అక్క‌డి నుంచి నివేదిక‌లు రావ‌డానికి ఇదిగో ఇన్నాళ్ల స‌మ‌యం ప‌ట్టింది.

అప్పుడెప్పుడో తీసుకున్న శాంపిల్స్ కు సంబంధించిన నివేదికలు ఇప్పుడు కోర్టుకు చేరిందని తెలుస్తోంది. నిజానికి, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఇంత‌వ‌ర‌కూ 12 కేసుల్ని న‌మోదు చేసింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్. అభియోగాలు ఎదుర్కొంటున్న వారి నుంచీ శాంపిల్స్ సేక‌రించిన సంగ‌తీ తెలిసిందే. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపింది. అయితే, వాటిలో కేవ‌లం ఐదు శాంపిల్స్ కు సంబంధించిన నివేదిక‌ల్ని మాత్ర‌మే ఇప్పుడు కోర్టుకు ఎఫ్.ఎస్‌.ఎల్‌. పంపించిందట. ఆ రిపోర్టుల్లో అన్నీ పాజిటివ్ అని తేలిన‌ట్టే స‌మాచారం. అంటే, ఆ ఐదురుగూ డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు తెలిన‌ట్టు చెప్పొచ్చు. కోర్టుకు చేరిన ఈ ఐదు నివేదిక‌ల్లో ముగ్గురు తార‌ల జాత‌కం దాగి ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ రిపోర్టుల్ని మ‌రో రెండు మూడు రోజుల్లో కోర్టు నుంచి తెప్పించుకునేందుకు సిట్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ త‌రువాత‌, అస‌లు క‌థ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త‌దుప‌రి ఛార్జ్ షీట్ దాఖ‌లు చేస్తారు. ఆ త‌రువాత‌.. ఏం జ‌రుగుతుంద‌నేది ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. నిందితుల పేర్ల‌ను కేవ‌లం ఛార్జిషీట్ లో మాత్ర‌మే పేర్కొని ఊర‌కుంటారా..? వారిని అరెస్టు చేస్తారా అనే చ‌ర్చ ఇప్పుడు వినిపిస్తోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంలో కీల‌క మ‌లుపుగానే చూడొచ్చు. కాక‌పోతే.. నివేదిక‌లు ఇవ్వ‌డానికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఇన్నాళ్లు స‌మ‌యం ప‌ట్టిన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది క‌దా! సేక‌రించిన న‌మూనాలను పరీక్షించే ర‌సాయ‌నాలు లేవ‌నీ, విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌నీ… రిపోర్టు ఆలస్యానికి ఇలాంటి కార‌ణాలను గ‌తంలో చెప్పారు. ఏదైతేనేం, ఇన్నాళ్ల‌కు ఆ నివేదిక‌లు కోర్టుకు వ‌చ్చాయి. అవి కూడా పూర్తిగా కాదు.. ఐదుగురివి మాత్ర‌మే! అప్పట్లో రెండో జాబితా ఉందన్నారు, విచారణ జరుగుతుందన్నారు. కానీ, అదీ బయటకి రాలేదు. ఓవ‌రాల్ గా ఈ డ్ర‌గ్స్ కేసు న‌త్త‌న‌డ‌క‌నే క‌దులుతోంద‌ని చెప్పాలి! ఈ కదలికలు చర్యలు వరకూ చేరేందుకు ఇంకెంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.