మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలి: గల్లా జయదేవ్

ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా?. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని బీజేపీ సభ్యులే డిమాండ్‌ చేసిన సంగతి గుర్తుందా?. తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా?. ఇదీ ప్రధాని నరేంద్రమోడీకి తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఆయన ఎదురుగానే సంధించిన ప్రశ్నలు. రాష్ట్ర విభజన దగ్గర్నుంచి ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు గల్లా జయదేవ్ దాదాపుగా.. గంట సేపు జరిగిన ప్రసంగంలో లోక్ సభ ముందు ఉంచారు.విభజన సమయంలో ఆస్తుల పంపిణీకి వనరుల ప్రాతిపదిక… అప్పుల పంపిణీకి జనాభా ప్రాతిపదిక తీసుకుని.. తీర్చలేని అన్యాయాన్ని చేశారని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ అందరిదీ అనుకుని అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారు. విభజన తర్వాత ఆ‌ నగరం తెలంగాణలోనే ఉండిపోయిందన్నారు. దాని వల్లే ఏపీ ఆదాయ వనరును ఏపీ కోల్పోయిందని గుర్తు చేశారు. విభజనలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కీలక పాత్ర పోషించిందన్న విషయం గుర్తు చేసిన గల్లా జయదేవ్… ఇదే సభలో ఆ బిల్లును ఎలా ఆమోదించారో దేశం మొత్తం చూసిందన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందన్న వ్యాఖ్యలను గల్లా జయదేవ్ గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం అబద్దలు చెప్పిందని నేరుగా మండిపడ్డారు.

ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెస్తున్న ప్రచారాన్ని కూడా గల్లా జయదేవ్ తిప్పికొట్టారు. పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్‌-90 కింద ఇచ్చేవ్నారు. ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినదే. ఆ నిధులన్నీ కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవేనని స్ఫష్టం చేశారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు ఇచ్చారు. అమరావతి ఇచ్చింది మాత్రం వెయ్యి కోట్లేనా అని ప్రశ్నించారు. చివరిగా ప్రత్యేకహోదా సహా హామీలన్నీ నెరవేర్చాలని కోరారు.

గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్న సమయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారమన్ జోక్యం చేసుకున్నారు. ప్రధానిని గల్లా జయదేవ్ మోసగాడిగా అభివర్ణించారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అలాంటి పదం ఉంటే తీసేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కేటాయించింది 13 నిమిషాలే అయినా గల్లా జయదేవ్.. అనర్ఘళంగా గంట పాటు ప్రసంగించారు. గల్లా ప్రసంగిస్తున్నంత సేపు.. ఏ ఫీలింగ్స్ లేకుండా మోదీ వింటూ ఉండిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com