టీఆర్ఎస్‌ టోటల్ యూటర్న్..! ఏపీకి మద్దతు అంతా ఉత్తదే..!!

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం… తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చాలా కాలంగా చెబుతున్నారు. పార్లమెంట్‌లో ఎంపీ కవిత కూడా… ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు చాలా సార్లు విభజన చట్టంలోని హామీల అమలు కోసం.. సోదర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసే ఏ పోరాటానికైనా మద్దతిస్తామని చెప్పారు. అవన్నీ మాటలు. ఇప్పుడు చేతలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా.. ఏపీ డిమాండ్లకు మద్దతిచ్చే సంగతేమో కానీ.. అడ్డం పడటం మాత్రం ఖాయమని తేలిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ పార్టీ ఎంపీలకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేశారు.

నిన్నటి వరకు… కాంగ్రెస్, బీజేపీలకు దూరం అన్న కేసీఆర్.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా అదే విధానం పాటించాలని ఎంపీలకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్‌ను పూర్తిగా వెనక్కి లాగాలని ఎంపీలను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణకు నష్టమనే వాదన తీసుకొచ్చారు. పారిశ్రామికంగా… తెలంగాణ నుంచి ఏపీకి పరిశ్రమలు తరలిపోతాయన్నారు. ఏపీకి ఇవ్వాల్సి వస్తే.. తెలంగాణకూ ఇవ్వాలని పట్టుబట్టాలని ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. ఏపీకి మేలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిందేనన్నారు. కేసీఆర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో.. నిన్నామొన్నటిదాకా.. ఏపీ గురించి సాఫ్ట్‌గా మాట్లాడిన ఎంపీలు కూడా.. ఇప్పుడు కాళేశ్వరంపై చంద్రబాబు లేఖలు రాశారంటూ….కారణాలు వెదుక్కుంటున్నారు.

టీఆర్ఎస్‌ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు.. చంద్రబాబు ప్రత్యేక ఫ్రంట్ ప్రయత్నాలు చేయకుండా.. ముందుగానే తానే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో… రంగంలోకి దిగారు. బీజేపీ మిత్రపక్షాలను పట్టించుకోకుండా.. ఇతర పార్టీలన్నింటినీ ముగ్గులోకి లాగుదామనుకున్నారు. కానీ ఫలించలేదు. బీజేపీ విధానాలను .. కేసీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. బీజేపీకి మద్దతుగానే ఇప్పుడు ఏపీకి వ్యతిరేకత వాదన వినిపించడానికి సిద్ధమయ్యారని ఢిల్లీ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఈ అవిశ్వాసంతో కేసీఆర్.. అసలు రంగేమిటో తేలిపోయిందన్న భావన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com