ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలు, న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో విచారణకు హాజరవడమే మంచిదని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం మూడు గంటలకు విచారణ కాబట్టి ఉదయం ఆయన నందినగర్ నివాసానికి వచ్చే అవకాశం ఉంది.
సిట్ విచారణకు కేసీఆర్ హాజరయ్యే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ తీరుకు, సిట్ దర్యాప్తుకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాలని శ్రేణులకు సూచించింది. నందినగర్ పరిసరాల్లో భారీగా కేడర్ మోహరించే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ జరుగుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందినగర్ వెళ్లే దారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం కక్షపూరితంగానే తమ నేతను వేధిస్తోందని ..తెలంగాణ సాధించిన నేతకు అవమానం.. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అని బీఆర్ఎస్ అంటోంది. ఆ కోణంలోనే నిరసనలు చేపట్టనున్నారు. సిట్ మాత్రం నోటీసుల ప్రకారం ప్రశ్నించనుంది. ఇదే తరహాలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను ప్రశ్నించింది. వారి వాంగ్మూలాల ఆధారంగానే కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.
